సాగర్‌ మరమ్మతులపై ఏపీ అభ్యంతరం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులు సందర్శించారు.

Published : 23 Feb 2024 03:42 IST

ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా బోర్డు అధికారులు

ఈనాడు, నల్గొండ; న్యూస్‌టుడే, నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులు సందర్శించారు. ఏటా వేసవి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనులకు అనుమతినివ్వాలని ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన జాతీయ డ్యాం భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) అధికారులను ప్రాజెక్టు అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనలపై ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం తెలపడంతో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు కేఆర్‌ఎంబీ ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ శివశంకరయ్యతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టుపైన జరుగుతున్న రైల్వేట్రాక్‌ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించింది. కుడికాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌తో పాటు, స్పిల్‌వే ప్రాంతాల్లో ఏర్పడిన గోతులు పూడ్చటం, ఇతర పనుల గురించి ప్రాజెక్టు అధికారులను అడిగి వివరాలు సేకరించింది. మరోవైపు డ్యాంపైనున్న కంట్రోల్‌రూం వరకు వెళ్లడానికి కేంద్ర బలగాలు తమకు అనుమతులివ్వట్లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాజెక్టుపైకి స్వేచ్ఛగా వెళ్లడానికి వీలుగా సీఆర్‌పీఎఫ్‌కు తగిన ఆదేశాలివ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని శుక్రవారమూ కేఆర్‌ఎంబీ బృందం పరిశీలించనుంది. ఏటా చేపట్టే ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనులు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను ఇస్తామని కృష్ణా బోర్డు అధికారులు వెల్లడించినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. సాగర్‌ సీఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డీఈలు సుదర్శన్‌, శ్రీనివాస్‌, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు కృష్ణా బోర్డు బృందం వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని