పురపాలిక.. నిధుల జాడలేక

రాష్ట్రంలోని పురపాలికలు నిధులు లేక నీరసిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు విడుదల కాకపోవటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

Published : 26 Feb 2024 04:47 IST

ఎక్కడికక్కడ నిలిచిన పనులు
ఏడాదిన్నరగా ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పురపాలికలు నిధులు లేక నీరసిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు విడుదల కాకపోవటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్తు బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి. చెల్లింపులు చేయకపోవటంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకురాని పరిస్థితి. ఆర్థికంగా బలంగా ఉన్న పురపాలికలు, కార్పొరేషన్లు చిన్నా చితక పనులతో నెట్టుకువస్తున్నాయి. ఆస్తిపన్ను వసూళ్లు కొంత మేరకు అక్కరకు వస్తున్నాయి.

కేంద్రం నుంచి వచ్చినా..

2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు రూ.764 కోట్లు కేటాయించింది. అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును పట్టణ ప్రగతి పేరిట విడుదల చేయాలి. ఇలా మొత్తం రూ.1,528 కోట్లు పురపాలికలకు అందాలి. కేంద్రం నుంచి నిధులు విడుదలైనా అవి రాజధాని దాటిన దాఖలాలు లేవు. ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు సర్దుబాటు చేసినట్లు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ.723 కోట్లు విడుదలయ్యాయి. మొదటి మూడు నెలల నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు విడుదల చేసింది. 2022 జూన్‌ నుంచి ఆ నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు పట్టణ ప్రగతి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గడిచిన ఆరు నెలలుగా విడుదలవక పనులు ముందుకు సాగడం లేదు. అంతకుముందు ప్రతి పురపాలికకు నెలకు సగటున రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వచ్చేవి. దీంతో అవి ఊపిరి పీల్చుకునేవి. ముఖ్యమంత్రి హామీల పథకం కింద సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే పనులు గతంలో మంజూరు చేసినట్లు సమాచారం. వాటికి సైతం నిధులు విడుదల చేయకపోవటంతో కాగితాలకే పరిమితమయ్యాయి.


నివేదికలు తెప్పించుకుని..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పురపాలికల్లో చేపట్టిన పనులు నిలిపివేయాల్సిందిగా ఉన్నతస్థాయిలో వర్తమానం పంపింది. పెండింగులో ఎన్ని పనులు ఉన్నాయి? వాటి పూర్తికి నిధులు ఎంత అవసరం? గుత్తేదారులకు ఎంత చెల్లించాలి? తదితర వివరాలను గడిచిన నెలలో పురపాలికల వారీగా నివేదికలు తెప్పించుకుంది. వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి కదలికా లేదు. ప్రస్తుత ప్రభుత్వం పురపాలకశాఖకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.11,372 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని