‘మూడేళ్ల సగటు’తో రాయితీ సిలిండర్లు

అర్హులైన లబ్ధిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated : 28 Feb 2024 07:12 IST

రూ.500కు గ్యాస్‌ పథకానికి మార్గదర్శకాల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అర్హులైన లబ్ధిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాల్ని నిర్దేశించింది. తెలంగాణలో తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి, వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్‌ కనెక్షన్‌ ఉండి, డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులని స్పష్టం చేసింది.

సబ్సిడీ చెల్లింపు ఇలా..

వినియోగదారులు తొలుత సిలిండర్‌కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. వారికి ఇచ్చే సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ రాయితీ మొత్తాన్ని ఆయిల్‌ కంపెనీలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందిస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతం పైలట్‌ విధానంలో అమలవుతుంది. లబ్ధిదారు సిలిండర్‌కు రూ.500 మాత్రమే చెల్లించి అందుకునే విధానాన్ని పౌరసరఫరాలు, ఆర్థికశాఖలు సమీప భవిష్యత్తులో తీసుకువస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.500కు గ్యాస్‌ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం అమలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ పథకానికి దరఖాస్తు చేయడం, సమాచారం అప్‌డేషన్‌, ధ్రువీకరణకు వచ్చే వారికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.


39.50 లక్షల మంది లబ్ధిదారులు

హైదరాబాద్‌లో అత్యధికం..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రాయితీపై గ్యాస్‌ సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతానికి 39,50,884గా తేలింది.  హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 3,55,153 మంది లబ్ధిదారులు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 44,005 మందికే గ్యాస్‌ సబ్సిడీ లభించనుంది. 2,22,938 మంది లబ్ధిదారులతో నల్గొండ రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే 4,63,078 మందికి, ఆ తర్వాత ఉమ్మడి మెదక్‌లో 4,11,091 మందికి, ఉమ్మడి ఖమ్మంలో 3,54,172 మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది.

1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా..

రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు, 89.99 లక్షల మందికి రేషన్‌కార్డులు ఉన్నా... గ్యాస్‌ రాయితీకి 39.50 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలారు. వడపోత ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని తెలుస్తోంది. రేషన్‌కార్డులు ఉన్నవాళ్లంతా ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు. దీంతో అక్కడే ఈ సంఖ్య కొంత తగ్గింది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆధార్‌, రేషన్‌కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ వివరాలను అధికారులు సరిపోలుస్తున్నారు. సరిపోలని వాటిని ప్రస్తుతానికి పక్కనపెడుతున్నారు. కొందరి ఇళ్లలో రెండేసి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో గ్యాస్‌ రాయితీ లబ్ధిదారుల సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. దరఖాస్తుదారు పేరుతో రేషన్‌కార్డు, ఆయన జీవిత భాగస్వామి లేదంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా పరిగణనలోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఒకే రేషన్‌కార్డులో పేరున్న కుటుంబ సభ్యుల పేరిట విడివిడిగా గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే.. కుటుంబ యజమాని పేరునే సబ్సిడీకి పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు