‘ఉచిత విద్యుత్‌’కు రేషన్‌కార్డే ప్రామాణికం

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు.

Updated : 28 Feb 2024 07:07 IST

ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులకు జీరో బిల్లులు.. మార్గదర్శకాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. దీని ప్రకారం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌కార్డు, ఆధార్‌, కరెంటు కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్‌ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల.. ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్‌ చట్టం కింద, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో విద్యుత్‌ శాఖ తెలిపింది.

ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చు

ఇప్పటివరకు దరఖాస్తు ఇవ్వనివారు తమ కరెంటు కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) లేదా మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వవచ్చు. వారికి కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్‌ సిబ్బంది వెళ్లి.. రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయవచ్చు.

జీరో బిల్లుల జారీ తర్వాతే అర్హుల సంఖ్యపై స్పష్టత

ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81.54 లక్షల మంది దరఖాస్తులిచ్చారు. వీరిలో కొందరికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కనపెడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా.. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్‌కార్డుల వివరాలు లేనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఈ నెల(ఫిబ్రవరి)లో బిల్లు జారీ చేసినప్పటి నుంచి వచ్చే నెలలో బిల్లు జారీ చేసేనాటికి నెల రోజుల్లో 200 యూనిట్లలోపు వినియోగం ఉన్న అర్హుల ఇళ్లకు జీరో బిల్లు జారీ కానుంది. మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావచ్చని అనధికార అంచనా. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకూ జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి.


ఒక్కో కుటుంబానికి రూ.900 వరకు లబ్ధి!

ప్రస్తుత కరెంటు ఛార్జీల ప్రకారం లెక్కలు వేస్తే.. నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 వరకు ఆదా అవుతుంది. 200 యూనిట్ల వరకు మూడు రకాల స్లాబుల్లో డిస్కంలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 1 నుంచి 100 యూనిట్ల వరకూ లోటెన్షన్‌(ఎల్‌టీ)-1ఏ కేటగిరీ, 1 నుంచి 200 యూనిట్ల వరకూ ఎల్‌టీ-1బీ1 కేటగిరీల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు ఒక ఇంట్లో 100 యూనిట్ల వరకు వినియోగిస్తే (ఎల్‌టీ-1ఏ కేటగిరీలో)
1 నుంచి 50 యూనిట్లకు రూ.1.95 చొప్పున అంటే రూ.97.50 బిల్లు వస్తుంది. 51 నుంచి 100 యూనిట్లకు రూ.3.10 చొప్పున అంటే రూ.155 బిల్లు వస్తుంది. రెండూ కలిపి మొత్తం రూ.252.50 ఛార్జీ వేస్తారు.

ఒక ఇంట్లో 200 యూనిట్ల వరకు వినియోగిస్తే (ఎల్‌టీ-1బీ1 కేటగిరీలో)

1 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.40 చొప్పున రూ.340, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.80 చొప్పున రూ.480 ఛార్జీ పడుతుంది. మొత్తంగా రూ.820 ఛార్జీ వేస్తారు.

కరెంటు కనెక్షన్లను ఇచ్చే సమయంలో తక్కువ యూనిట్లు వినియోగించే ఇళ్లకు 1 నుంచి 5 కిలోవాట్ల వరకూ లోడుతో ఇస్తారు. ఒక్కో కిలో వాట్‌కు రూ.10 చొప్పున డిమాండు ఛార్జీని ప్రతి నెలా బిల్లులో వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా ‘కస్టమర్‌ రుసుం, విద్యుత్‌ సుంకం’ పేరుతో ప్రతి బిల్లులో అదనంగా రూ.40 నుంచి 50 వరకూ వేస్తున్నారు. వీటికి కూడా మినహాయింపు ఇచ్చి జీరో బిల్లు ఇస్తారు. ఇవన్నీ కలిపితే కచ్చితంగా 200 యూనిట్లు వాడే ఇంటికి గరిష్ఠంగా రూ.900 వరకూ ఆదా అవుతుందని అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని