ప్రభుత్వ పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌

ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టిసారించింది.

Updated : 29 Feb 2024 05:26 IST

హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు
శివబాలకృష్ణ ‘మాన్యువల్‌’ అనుమతులపై ఆరా
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మాణాల నాణ్యత పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టిసారించింది. హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గడిచిన పదేళ్లలో జరిగిన పనుల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్‌ బృందాలు బుధవారం తనిఖీలు నిర్వహించాయి. గతంలో హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా వ్యవహరించిన శివబాలకృష్ణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖ ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పలు వెంచర్లకు అనుమతుల విషయంలో కొందరు ఉన్నతాధికారుల అండతో శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడినట్లు అనిశా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో తాజాగా విజిలెన్స్‌ విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. శివబాలకృష్ణ ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా మంజూరు చేసిన అనుమతులకు సంబంధించిన దస్త్రాలపై విజిలెన్స్‌ ప్రత్యేకంగా దృష్టిసారించి తమ వెంట తీసుకెళ్లింది. పరిశీలన తర్వాత వాటిల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. గత పదేళ్లలో హెచ్‌ఎండీఏలో స్థిరాస్తి వెంచర్లకు అనుమతుల విషయంలో పలు అక్రమాలు జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్షలో వెల్లడైన నేపథ్యంలో విజిలెన్స్‌ సోదాలకు ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్‌లోనూ బుధవారం విజిలెన్స్‌ బృందాలు సోదాలు నిర్వహించాయి. కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పనుల నాణ్యతను పరిశీలించాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం.


ఖమ్మంలో తనిఖీలు

ఒకే గుత్తేదారుకు 28 పనులు కట్టబెట్టడంపై ఫిర్యాదులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బుధవారం ఖమ్మంలోని పలు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రజారోగ్యశాఖ, కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఈఈ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో అధికారులు రికార్డులు తనిఖీచేసి, వాటి నకళ్లు తీసుకున్నారు. ఒకే గుత్తేదారుకు రూ.300 కోట్లకు పైగా విలువైన 28 పనులు కట్టబెట్టడం, వాటికి బిల్లులు పూర్తిగా చెల్లించడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీంతో వారు రంగంలోకి దిగారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గోళ్లపాడు ఛానల్‌ అభివృద్ధి పనులు, కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు, రఘునాథపాలెం మండలంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం నిర్మాణం, ఇల్లెందు రోడ్డుపై డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు తదితర 28 పనులు ఒకే గుత్తేదారు చేపట్టారు. ఈ పనులకు సుడా (స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు పెద్ద మొత్తంలో అదనంగా మంజూరు చేశారు. ఎస్‌డీఎఫ్‌ (స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) రూ.100 కోట్లతో గోళ్లపాడు ఛానల్‌ నిర్మాణం చేపట్టగా ఆ తర్వాత అదనంగా మరో రూ.30 కోట్ల ఇతర నిధులు మంజూరు చేశారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌కు సైతం అదనంగా నిధులు మంజూరు చేయించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్సీ బాలకోటి విలేకర్లతో మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదుల మేరకు రికార్డులు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని