Hyderabad: కళ్లకు గంతలతో ద్విచక్రవాహనాలపై అయోధ్య రాముని చెంతకు..

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలికులు వినూత్న ప్రయత్నం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని, 8 రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1,600 కిలోమీటర్లు ప్రయాణించి, అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు.

Published : 02 Mar 2024 05:31 IST

8 రోజులు... 1,600 కిలోమీటర్లు 
లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలికులు వినూత్న ప్రయత్నం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని, 8 రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1,600 కిలోమీటర్లు ప్రయాణించి, అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మారుతిజోషి, సరూర్‌నగర్‌కు చెందిన రామకృష్ణ మిత్రులు.. ఇద్దరూ ఇంద్రజాలికులే. మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్‌ షోలు చేస్తుండగా, రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్‌గా ప్రదర్శనలు ఇస్తున్నారు. రామభక్తుడైన మారుతిజోషి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు. అందుకే కళ్లకు గంతలు, ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు. స్నేహితుడు రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంతా ఒప్పుకొన్నారు. ఇలా ఫిబ్రవరి 23న ముచ్చింతల్‌లో చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు. తొలిరోజు ముచ్చింతల్‌ నుంచి కామారెడ్డి అటు నుంచి ఆదిలాబాద్‌, నాగ్‌పుర్‌, సియోన్‌, లతందాన్‌, మంగమాన్‌, కాశీ తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు. దారిపొడవునా రామభక్తులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతిజోషి తెలిపారు. ఆశ్రమాల్లో బస చేస్తూ ముందుకు సాగినట్టు తెలిపారు. కళ్లకు గంతలతో వాహనం నడిపేందుకు నెల రోజులు సాధన చేశామని ఆ తర్వాతే యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని