రాష్ట్రానికి జాతీయ చేనేత సాంకేతిక సంస్థ

తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఐఐహెచ్‌టీ)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Updated : 03 Mar 2024 04:44 IST

మంజూరు చేస్తూ సమాచారం పంపిన జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్‌
నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే..

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఐఐహెచ్‌టీ)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ఈ విషయంపై మాట్లాడారు. కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి రచ్నాషా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలోనూ రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమెను కలిసి విన్నవించారు. దీంతో కేంద్రం స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేస్తూ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్‌ కార్యాలయం సమాచారం పంపింది. ఇందుకు అవసరమైన భూమి, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే జరపాలని సూచించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో జోధ్‌పుర్‌, సాలెం, వారణాసి, గువాహటి, బార్గా, ఫులియా, వెంకటగిరి, గడగ్‌, చంపా, కన్నూర్‌లలో ఐఐహెచ్‌టీలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే పోచంపల్లిలో స్థాపించాలని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

మంత్రి తుమ్మల హర్షం

జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేందుకు, విద్యార్థులకు జౌళికి సంబంధించిన సాంకేతిక కోర్సులు, డిజైనింగ్‌, అపారెల్స్‌, డిజైనింగ్‌, మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్లలో నైపుణ్యాలు నేర్పేందుకు ఐఐహెచ్‌టీ ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ‘ప్రస్తుతం ఈ కోర్సుల కోసం తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. నూతన పారిశ్రామిక, జౌళి విధానాలతో దేశ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. వాటికి నిపుణుల అవసరం ఉంది. ఐఐహెచ్‌టీ ఏర్పాటుతో విద్యార్థులు సాంకేతిక నిపుణులుగా మారి ఉపాధి పొందే వీలుంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని