కడెం గేట్ల మరమ్మతులకు టెండర్‌ ఖరారు

అత్యవసరంగా చేపట్టాల్సి ఉన్న కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు టెండర్లు ఖరారయ్యాయి.

Published : 03 Mar 2024 03:47 IST

4 శాతం అధికానికి దక్కించుకున్న గుత్తేదారు సంస్థ
పనుల పూర్తికి 4 నెలల గడువు

ఈనాడు, హైదరాబాద్‌: అత్యవసరంగా చేపట్టాల్సి ఉన్న కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు టెండర్లు ఖరారయ్యాయి. గత నెలలో తొలిసారి టెండర్లను పిలువగా గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లు పిలువగా రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. రూ.3.70 కోట్ల పనులకు గాను స్వప్న కన్‌స్ట్రక్షన్స్‌ 4 శాతం అధికానికి, బెకాన్‌ సంస్థ 4.8 శాతం అధికానికి బిడ్లు వేశాయి. చివరకు స్వప్న కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు టెండరు అప్పగించారు. ఈ మేరకు శనివారం నిర్మాణ సంస్థతో ఇంజినీర్లు ఒప్పందం చేసుకుని మరమ్మతులకు అనుమతులు ఇచ్చారు.

బిల్లుల మంజూరీలో జాప్యంతో..

కడెం ప్రాజెక్టు మరమ్మతులు ముందుకు కదలకపోవడానికి బిల్లుల మంజూరీలో జాప్యమే కారణమన్న ఆరోపణలున్నాయి. మరమ్మతులు, ఇతర పనులకు ప్రతిపాదనలు, టెండర్లు పిలవడం లాంటి ప్రక్రియలు కూడా వేగంగా జరగడం లేదని సమాచారం. 2022, 2023 వానాకాలాల్లో భారీ వరదలు వచ్చి ప్రాజెక్టు ప్రమాద స్థితిలో పడినా పూర్తిస్థాయి మరమ్మతులు సకాలంలో చేపట్టలేదు. తాజాగా టెండర్లు ఖరారైన నేపథ్యంలో రోలర్స్‌, రోప్‌లు, బేరింగ్స్‌, బుష్‌ల మార్పిడి, గ్రీజింగ్‌ తదితర పనులు చేపట్టనున్నారు. 18 గేట్లలో స్వదేశీ సాంకేతికతతో ఉన్న 9 గేట్ల కౌంటర్‌ వెయిట్లు కిందికి ఉండటంతో వరదల సమయంలో సమస్యగా మారుతున్నాయి. గేట్లు తెరిచినప్పుడు స్పిల్‌వేపై పడిన వరద ఉద్ధృతికి కౌంటర్‌ వెయిట్లు కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం వాటిని కూడా పైకి మార్చనున్నారు. 4 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేసేలా దృష్టిసారించినట్లు ఆదిలాబాద్‌ సీఈ తొడుపునూరి శ్రీనివాస్‌ తెలిపారు. మరోవైపు రూ.1.44 కోట్లతో జరుగుతున్న ఆప్రాన్‌ మరమ్మతులు కూడా పక్షం రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని