ఈ ‘టానిక్‌’కు ఇన్ని మినహాయింపులెందుకు..!

విదేశీ మద్యం విక్రయాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ‘టానిక్‌’ ఎలైట్‌ మద్యం దుకాణానికి అనుమతుల్లోనే మతలబులున్నట్లు వెలుగులోకి వచ్చింది.

Updated : 08 Mar 2024 10:18 IST

అన్నింటికీ రెండేళ్లు.. దీనికి మాత్రం అయిదేళ్ల లైసెన్స్‌
తెరవెనక బడాబాబుల హస్తంతో అధికారుల గప్‌చుప్‌
ఆబ్కారీశాఖ వర్గాల ఆరా

ఈనాడు, హైదరాబాద్‌- పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: విదేశీ మద్యం విక్రయాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ‘టానిక్‌’ ఎలైట్‌ మద్యం దుకాణానికి అనుమతుల్లోనే మతలబులున్నట్లు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అన్నింటికీ రెండేళ్ల కాలపరిమితి ఉంటే.. టానిక్‌కు అయిదేళ్ల గడువుతో లైసెన్స్‌ జారీ చేయడమే కాకుండా విక్రయాల్లో పలు రాయితీలివ్వడం విస్తుగొలుపుతోంది. అయిదేళ్ల తర్వాత కూడా ఏటా గడువును పొడిగించడం వెనక గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 18 డిపోల్లో ఎక్కడి నుంచైనా మద్యం దిగుమతి చేసుకునే వెసులుబాటు ఎందుకు కల్పించారు, సాఫ్ట్‌డ్రింకులు, సిగరెట్లు, గ్లాసుల్లాంటివి విక్రయించుకోవడానికి ఎలా అనుమతిచ్చారనే.. సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కేవలం రూ.15 లక్షల అదనపు రుసుం

2016 అక్టోబరు 26న ఎలైట్‌ షాప్‌ రూల్స్‌-2016 పేరున అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రా జీవో జారీ చేశారు. దీని ప్రకారం దుకాణంలో ఫారిన్‌, ఇండియన్‌ మేడ్‌ ప్రీమియం లిక్కర్‌, వైన్‌లు అమ్ముకోవచ్చు. 

  • జూబ్లిహిల్స్‌, ప్రశాసన్‌నగర్‌ చిరునామాతో అమిత్‌రాజ్‌ లక్ష్మారెడ్డి పేరున ఈ దుకాణం లైసెన్స్‌ ఉంది. అదే ప్రాంతంలో ఇతర దుకాణాల లైసెన్స్‌ ఫీజు రూ.1.1 కోట్లు ఉండగా.. టానిక్‌కు మాత్రం రూ.1.25 కోట్లుగా నిర్ణయించారు. రూ.15 లక్షలు అదనంగా చెల్లించినందుకు ఇన్ని మినహాయింపులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
  • వ్యాట్‌ చట్టంలోని షెడ్యూల్‌-6, ఎక్స్‌ప్లనేషన్‌-1 ప్రకారం ఆబ్కారీశాఖకు చెందిన మద్యంపై రాష్ట్ర బేవరేజస్‌ కంపెనీ లిమిటెడ్‌(టీఎస్‌బీసీఎల్‌)కు మాత్రమే వ్యాట్‌ చెల్లించాల్సి ఉంది. టానిక్‌ ఎలైట్‌ విదేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకున్నా.. తప్పనిసరిగా టీఎస్‌బీసీఎల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి లేబులింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే నిర్దేశిత 70% వ్యాట్‌ ప్రభుత్వానికి వస్తుంది. కానీ అలా జరగలేదనే ఆరోపణలున్నాయి.
  • అన్ని మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు బంద్‌ చేయాలి. టానిక్‌కు 12 వరకు అనుమతిచ్చారు. ఇదే అదనుగా దీని అనుబంధ దుకాణాలు కూడా రాత్రి ఒంటిగంట వరకు విక్రయాలు సాగించేవన్న ఆరోపణలున్నాయి.

రెండో రోజూ తనిఖీలు

నగర శివారు ప్రాంతం సుచిత్రా సమీపంలోని టానిక్‌ అనుబంధ దుకాణంలో గురువారం రెండో రోజు కూడా ఆబ్కారీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది నూతన ఎక్సైజ్‌ పాలసీ మొదలైనప్పటి నుంచి ఏ మద్యం ఎంత మేరకు కొన్నారు.. ఎంత మేరకు విక్రయించారనే దానిపై ఆరా తీశారు. పలు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ కూడా అధికారులతో సమీక్షించారు. 2016 నుంచి ఒక్క టానిక్‌లోనే రూ.వెయ్యి కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని ఆబ్కారీశాఖ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని