దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి

నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Updated : 19 Mar 2024 04:32 IST

పరకాల, న్యూస్‌టుడే: నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోసారి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వివరాలివి.. హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేశ్‌, అశ్విత దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అద్వి(3), మహాన్‌(1) సంతానం. వెంకటేశ్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. మహాన్‌ పుట్టిన నెల రోజుల నుంచే తలకు కణితి పెరుగుతుండడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్లనే కణితి పెరుగుతోందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించాలని సూచించారు.

హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు రూ.లక్షల అప్పులు చేసి మూడు పర్యాయాలు శస్త్ర చికిత్సలు చేయించారు. అయినప్పటికీ నయం కాకపోగా రోజురోజుకూ కణితి పరిమాణం పెరుగుతోంది. దీంతో వైద్యులను సంప్రదించగా మరోసారి శస్త్రచికిత్స చేయాలని, అందుకు రూ.5 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.లక్షల అప్పులు చేశామని, మరోసారి శస్త్ర చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు సాయమందిస్తే తమ కుమారుడిని కాపాడుకుంటామని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. వారి వద్ద ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఈ వ్యాధికి వర్తించదన్నారు. దాతలు 7075419300 నంబరును సంప్రదించాలని చిన్నారి తండ్రి వెంకటేశ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని