రూ.లక్షకు మించి విత్‌డ్రా చేసినా.. డిపాజిట్‌ చేసినా ఆరా

బ్యాంకుల నుంచి రూ.లక్ష అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.

Updated : 22 Mar 2024 09:40 IST

బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టండి
రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుల నుంచి రూ.లక్ష అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్‌ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ మేరకు లేఖ రాసింది. ‘‘రూ.లక్ష అంతకుమించి నిర్వహించే లావాదేవీల వివరాలను అన్ని బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించే బాధ్యతను సంబంధిత సిబ్బందికి అప్పగించాలి. ఎన్నికల సమయంలో ఒకే బ్యాంకు బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు సొమ్మును బదిలీ చేస్తున్న దాఖలాలపై ఫిర్యాదులు వస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు లావాదేవీలు చేపట్టే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల ఖాతాల నుంచి చేపట్టే లావాదేవీల పైనా నిఘా పెట్టాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఆయన భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షకు మించి నిర్వహించే లావాదేవీలను అఫిడవిట్‌లో నమోదు చేయాలి. ఆ వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి రెండు నెలల ముందు నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.10 లక్షలకు మించిన నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్లపైనా నిఘా పెట్టాలి. ఆయా వివరాలను ఆదాయ పన్నుశాఖ నోడల్‌ అధికారులకు అందచేయాలి’’ అని ఎన్నికల సంఘం ఆ లేఖలో స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని