వీసాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు!

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల వీసా(ఎఫ్‌1) ఇంటర్వ్యూ సమయాల(స్లాట్ల) కోసం ఎదురుచూపులు తప్పట్లేదు.

Updated : 24 Mar 2024 07:08 IST

మార్చి ముగుస్తున్నా విడుదల కాని స్లాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల వీసా(ఎఫ్‌1) ఇంటర్వ్యూ సమయాల(స్లాట్ల) కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. సాధారణంగా ఫాల్‌ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈ దఫా మార్చి నెల ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందుగా మాత్రమే ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తక్కువ సమయం ఉండగా స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇక రెండు సార్లే...

వీసా ఇంటర్వ్యూకు ఒకదఫా వెళ్లిన విద్యార్థి తిరస్కారానికి గురైతే ఏం చేయాలన్నది అగమ్యగోచరంగా ఉంది. గతంలో స్లాట్లు అందుబాటులో ఉంటే మూడు దఫాల వరకు ఇంటర్వ్యూకు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి రెండుసార్లకు పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్‌, జులై నెలల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు రెండో వారం తరవాత నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు తిరస్కృతులకు విడిగా స్లాట్లు జారీ చేసేవారు. ఈసారి ఎప్పుడు విడుదల చేస్తారు. వీసా పొందిన వారు అమెరికా వెళ్లేప్పటికీ తరగతులు ప్రారంభం అవుతాయేమోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పర్యాటకులకూ పరిమితంగానే...

హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో పర్యాటక వీసా(బీ1, బీ2) స్లాట్లు పరిమితంగా విడుదల చేయటం చర్చనీయాంశమైంది. విద్యార్థి వీసాలు ఆయా సమయాల్లో విడుదల చేస్తున్నప్పటికీ పర్యాటక వీసా దరఖాస్తులకు మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ప్రస్తుతం కొద్ది రోజుల తక్కువగా ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాన్సులేట్‌ కార్యాలయం నూతన ప్రాంగణంలోకి మారిన నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కౌంటర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఆ స్థాయిలో ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేయటం లేదనే అభిప్రాయాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని