స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం

గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు, ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

Published : 24 Mar 2024 04:57 IST

కలెక్టర్లకు గనులశాఖ ఆదేశాలు
సీనరేజి వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు, ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనులశాఖ ముఖ్యకార్యదర్శి బెన్హర్‌ మహేశ్‌దత్‌ ఎక్కా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు-2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి, ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే ‘శ్యాండ్‌ ట్యాక్సీ(మన ఇసుక వాహనం)’ విధానం అమల్లో ఉన్న నల్గొండ తదితర జిల్లాల్లో ఈ వెసులుబాటు అమలుకావడం లేదు. ప్రజలు తమ సొంత అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్తుంటే పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అడ్డుకొని జరిమానాలు విధిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో స్పందించి తాజాగా నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో నదులు, ఉపనదులు, వాగుల నుంచి స్థానిక ప్రజలు సీనరేజి రుసుం కట్టకుండా ఇసుకను తీసుకెళ్లవచ్చని తెలిపింది. ఏవైౖనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని