గురుకులాలకు సొంత భవనాలు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.

Published : 25 Mar 2024 05:49 IST

తొలి ఏడాది ఒక్కో సొసైటీ పరిధిలో 20 నిర్మాణం
ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. తొలి విడతలో భూములు గుర్తించిన.. ఇప్పటికే స్థలాలు స్వాధీనం చేసిన గురుకులాలకు భవనాలు నిర్మించనుంది. ఇలాంటి గురుకులాలు ఎన్ని ఉన్నాయి? ఏడాదిలోగా ఎన్ని భవనాలు పూర్తవుతాయి? ఎన్ని నిధులు అవసరమో వివరాలు సేకరిస్తోంది. భవనాల నిర్మాణానికి సంబంధించి గురుకుల సొసైటీల నుంచి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. వాటికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయని సొసైటీలు భావిస్తున్నాయి.

ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొత్తగా 731 గురుకులాలు ఏర్పడ్డాయి. ఇందులో 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు అద్దె భవనాల్లో ప్రారంభమయ్యాయి. తొలుత 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఏడాదికో తరగతి ఉన్నతీకరణతో జూనియర్‌ కళాశాలల స్థాయికి చేరాయి. విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరగతి గదిలోనే భోజనం, బసతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు నియోజకవర్గాల్లో భూములు గుర్తించారు. కనీసం 5 నుంచి 10 ఎకరాల్లో భవనాలు నిర్మించాలని భావించారు. అయితే అప్పట్లో నిధులు మంజూరు కాక ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. తొలి ఏడాది ఒక్కో సొసైటీ పరిధిలో 20 వరకు గురుకులాలకు భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


కొత్త టీచర్లకు జూన్‌లో పోస్టింగులు..

కొత్తగా ఎంపికైన గురుకుల టీచర్లు, అధ్యాపకులకు వచ్చే జూన్‌ (2024-25 విద్యాసంవత్సరం)లో పోస్టింగులు ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఇటీవల 7,800 నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్‌) అమలవుతుండటంతో కొన్ని జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నవారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ సమస్య వస్తుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో సొసైటీల వారీగా వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని సంక్షేమాధికారులు నిర్ణయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని