జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

రాష్ట్ర ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Published : 25 Mar 2024 05:50 IST

మంత్రి శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌, బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదివారం సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. ఆధార్‌ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికీ స్మార్ట్‌కార్డు వంటి హెల్త్‌ ప్రొఫైల్‌ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామన్నారు. పేరు టైప్‌ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

నా తల్లి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..

తన తండ్రి శ్రీపాదరావు మరణానంతరం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని.. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో సేవలందించాలంటే చాలా సహనం ఉండాలన్నారు. గత భారాస పాలనలో తనకు గన్‌మెన్‌ను తొలగించినా.. భయపెట్టే ప్రయత్నం చేసినా.. వెనకడుగు వేయలేదని, హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిగానే పనిచేశానన్నారు. మంథని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం హౌస్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కిషన్‌రావు, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మాజీ అధ్యక్షుడు వి.నాగభూషణం, నడిపెల్లి వేణుగోపాల్‌రావు, ఇనుగాల భీమారావులు మంత్రికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సభలో మాజీ ఎంపీ సుగుణకుమారి, వైదిక సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, చీఫ్‌ ప్యాట్రన్‌ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యేలకు ఔషధాల సరఫరా

మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుగుణంగా ఔషధాలను సరఫరా చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్‌, ఆంజనేయులు, సత్యనారాయణగౌడ్‌ తదితరులు ఆదివారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఔషధాల సరఫరాలో కొరతను తీర్చాలని వివరించారు. ఔషధాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని