ఎన్‌హెచ్‌ఎం నిధులు రానట్లే!

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది.

Published : 28 Mar 2024 03:47 IST

 రూ.348 కోట్లపై ఆశలు వదులుకున్న వైద్య, ఆరోగ్య శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. మార్చి 31 లోపు ఇవి రాకపోతే 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులకు గండిపడినట్లే అనే అభిప్రాయానికి వచ్చింది. మూడు, నాలుగు త్రైమాసికాలకు సంబంధించి నిధుల కోసం ప్రభుత్వం నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో విడుదలైనా రాష్ట్రానికి మాత్రం ఇవ్వలేదు. సాధారణంగా నిబంధనలు పాటిస్తే ఎన్‌హెచ్‌ఎం నిధులు విడుదల కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు. కేంద్రం ఆదేశాలన్నీ పూర్తిస్థాయిలో పాటించినా నిధులు రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యసేవల్లో ఎన్‌హెచ్‌ఎం కీలకం. మాతా, శిశు సంరక్షణ, అంటువ్యాధుల నివారణ, అసంక్రమిత వ్యాధుల నివారణకు పిల్లలు, యువత, మహిళలు, వృద్ధుల కోసం, మానసిక, శారీరక దివ్యాంగులకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు ఇతర వైద్య సేవలు, వ్యాక్సినేషన్‌లకు మిషన్‌ ద్వారా తోడ్పాటు అందుతోంది. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేసి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఉద్యోగులు ఎన్‌హెచ్‌ఎం కింద విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. నవంబరు నుంచి 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఎన్‌హెచ్‌ఎంలో భాగస్వాములైన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.100 కోట్ల మేర ఇటీవల విడుదల చేసింది. 2 నెలల వేతనాలు చెల్లించింది.

జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా 60, 40 శాతం చొప్పున కేంద్రం, రాష్ట్రం రూ.1,480 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం వాటా రూ.888 కోట్లు, రాష్ట్ర వాటా రూ.592 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వాటా నుంచి రూ.540 కోట్లు విడుదలయ్యాయి. 17 వేల మంది ఉద్యోగులకు మార్చి ఆఖరు నాటికి 3 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉండటం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన పేర్లు పెట్టడంతోపాటు నిబంధనలన్నీ పాటిస్తున్నా నిధులు విడుదల కాలేదని.. దీనిపై ఈ నెల మొదటి వారంలో కూడా కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖకు లేఖ రాసినా ఫలితం లేకపోయిందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ నిధులపై ఆశలు వదులుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు