న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు

జ్యుడిషియల్‌ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్‌ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Updated : 29 Mar 2024 05:38 IST

తిహాడ్‌ జైలు అధికారులపై కోర్టుకు కవిత ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: జ్యుడిషియల్‌ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్‌ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తనకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఈ నెల 26న కోర్టు జారీచేసిన ఉత్తర్వులను జైలు అధికారులు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలున్నాయని.. వాటికితోడు అధిక రక్తపోటు సమస్య కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి అడిగిన సౌకర్యాలు కల్పించాలని జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అయితే, ఇంటి భోజనానికి అనుమతివ్వడంలేదని.. పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్‌షీట్స్‌, పుస్తకాలు, రగ్గులను కూడా అనుమతించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పెన్ను, పేపర్లు ఇవ్వలేదని తెలిపారు. కనీసం మంగళసూత్రం, కళ్లజోడు, మందులకు కూడా అనుమతివ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శనివారం ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా విచారించనున్నారు. గురువారం ములాఖత్‌ సమయంలో కవితను ఆమె భర్త అనిల్‌కుమార్‌ కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని