టెట్‌పై ఉపాధ్యాయుల్లో గందరగోళం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు.

Published : 29 Mar 2024 02:51 IST

సందేహాల నివృత్తికి వినతులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో 2010 ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత మినహాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఆ అంశాన్ని తొలగించడంతో గందరగోళం ఏర్పడింది. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల్లో ఎవరు టెట్‌ రాయాలి? ఏ పేపర్‌ రావాలనేది అందులో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు టెట్‌కు దరఖాస్తు గడువు వచ్చే నెల 10వరకే ఉంది.

ఎస్జీటీ, ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుల (పీఎస్‌ హెచ్‌ఎం) పోస్టులు రెండూ ఒకేస్థాయివి అయినందున 2010 ఆగస్టు 23కు ముందే ఎస్జీటీగా నియామకమైన ఉపాధ్యాయులు ‘పీఎస్‌ హెచ్‌ఎం’ పదోన్నతి పొందాలంటే టెట్‌ పేపర్‌-1 పాస్‌ కావాల్సిన అవసరం ఉందా? అనేదానిపైనా స్పష్టత లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంటర్‌, డీఈడీ అర్హత ఉన్నవారు మాత్రమే టెట్‌ పేపర్‌-1 రాయడానికి అర్హులని టెట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ 2010కి ముందు ఇంటర్‌, టీటీసీ, డీఈడీ, డిగ్రీ, బీఎడ్‌ అర్హతలు కలిగిన వారు కూడా ఎస్జీటీ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. పీఎస్‌ హెచ్‌ఎం పదోన్నతికి టెట్‌ పేపర్‌-1 తప్పనిసరి చేస్తే వారందరూ ప్రమోషన్‌ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒకే లెవల్‌లో పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు వర్తింపజేయాలని కోరుతున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరైతే.. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. అవసరమైతే ఎన్సీటీఈకి వివరించి వారి నుంచి అనుమతి తీసుకుని ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని