రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!

తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Published : 29 Mar 2024 03:40 IST

కేంద్ర అటవీశాఖకు నిధులు చెల్లిస్తే నీల్వాయి పనులకు మార్గం సుగమం

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టు స్వల్ప మొత్తం నిధుల కోసం ఎదురు చూస్తోంది. రూ.50 లక్షలు ఖర్చు చేస్తే చాలు 5 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పనులకు మార్గం ఏర్పడనుంది. జూన్‌లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించినా నిధులు విడుదల కాలేదు.

స్టేజ్‌-2 క్లియరెన్స్‌లు లభించినా...

వేమన్‌పల్లి మండలంలో 2006లో రూ.90.50 కోట్లతో నీల్వాయి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. కొంతవరకు నిర్మాణం పూర్తయిన తరువాత 2016లో రూ.211.32 కోట్లతో డిజైన్‌ మార్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ఏఐబీపీ కింద కేంద్రం నిధులు కేటాయించింది. వేమన్‌పల్లి, కోటపల్లి మండలాల పరిధిలో 13 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో ఉండటంతో నిర్మాణానికి ఆ శాఖ అనుమతులు రాకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు శాఖకు రూ.50.29 లక్షలు చెల్లించాలనే షరతుపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ గతేడాది డిసెంబరు 14న స్టేజ్‌-2 అనుమతులు జారీ చేసింది. ఇప్పటికీ ఈ మొత్తాన్ని నీటిపారుదల శాఖ చెల్లించలేదు. మొత్తంగా రూ.16 కోట్ల వరకు బడ్జెట్‌ ఈ ప్రాజెక్టు కేటాయించాల్సి ఉందని నీటిపారుదల శాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. పనులు వెంటనే ప్రారంభిస్తే జూన్‌ లేదా డిసెంబరు నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ కూడా ఏఐబీపీ ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని