పాలమూరు ప్రాజెక్టు వద్ద మెటల్‌ మాయంపై విజి‘లెన్స్‌’!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సొరంగాలు, కాలువల నిర్మాణాల్లో బయటకు తీసి, నిల్వ ఉంచిన మెటల్‌ (రాళ్లు) మాయమవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టి సారించింది.

Published : 30 Mar 2024 04:26 IST

సమగ్ర విచారణకు సమాయత్తం

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సొరంగాలు, కాలువల నిర్మాణాల్లో బయటకు తీసి, నిల్వ ఉంచిన మెటల్‌ (రాళ్లు) మాయమవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టి సారించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌ వద్ద కృష్ణా నది వెనుక జలాలను తీసుకునేలా భూగర్భ పంపుహౌస్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి నార్లాపూర్‌ పంపుహౌస్‌కు, అక్కడి నుంచి దశలవారీగా నీటిని ఎత్తిపోసేందుకు పలు ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఈ మేరకు 1, 3, 4, 5, 6, 7, 8, 12 ప్యాకేజీల నిర్మాణ ప్రదేశాల్లో మెటల్‌ను నిల్వచేశారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు విలువైన ఈ రాళ్లను తరలించుకుపోతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రూ.కోట్ల విలువైన మెటల్‌ మాయంపై తాజాగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టి సారించి.. నీటిపారుదల శాఖ నుంచి వివరాలు సేకరించింది. పాలమూరు ఎత్తిపోతల 8 ప్యాకేజీల్లో 512.99 లక్షల క్యూమెక్స్‌ (ఒక క్యూమెక్స్‌ సుమారు 35.31 ఘనపుటడుగులు) మెటల్‌ను వెలికితీసినట్లు నీటిపారుదల శాఖ నాగర్‌కర్నూల్‌ చీఫ్‌ ఇంజినీరు (సీఈ) విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఇటీవల తెలిపారు. వెలికితీసిన మెటల్‌ను తిరిగి ప్రాజెక్టు నిర్మాణాలకు వినియోగించేందుకు గుత్తేదారులతో నీటిపారుదల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జనవరి వరకు 79.62 లక్షల క్యూమెక్స్‌ మెటల్‌ను తిరిగి వినియోగించారు. నిల్వ చేసిన మెటల్‌కు సంరక్షణ కొరవడటంతో కొన్ని అనుమతి లేని క్రషర్ల యాజమాన్యాలు భారీ వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. 2021 నుంచి ఇలా తరలింపు జరుగుతున్నట్లు వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల స్టోన్‌ క్రషర్స్‌ క్వారీ యజమానుల సంఘం కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. నిర్మాణ ప్రాంతాల్లో బాధ్యత వహించే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు ఇంజినీర్లు ఈ తరలింపునకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2022, 2023ల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు