సంక్షేమ పథకాలకు మూలం తెదేపా

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు మూలం తెదేపా అని అన్నారు.

Published : 30 Mar 2024 04:37 IST

నందమూరి రామకృష్ణ
ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు మూలం తెదేపా అని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామకృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ప్రారంభించిన పథకాలే దేశంలో పలుచోట్ల వివిధ పేర్లతో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో తెదేపాకు పూర్వవైభవం తెచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకాను చంపిందెవరో దేవుడికి తెలుసని ఏపీ సీఎం జగన్‌ అంటున్నారని, మరి సీఎంగా ఆయనకేం తెలుసో అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారని, తెదేపాను అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్‌, జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. భారాస పరిస్థితి చూస్తుంటే.. ఇక పార్టీ ఉంటుందా లేదా అనే భావన ప్రజల్లో కలుగుతోందన్నారు. తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించిన వారే.. ఇప్పుడు అల్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య, సామ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర్లుతోపాటు మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి తిప్పన్న నాయకత్వంలో పెద్దసంఖ్యలో ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు