ఈ క్షణాలు పీవీ కుటుంబానికి మధురమైనవి

దేశ సర్వతోముఖాభివృద్ధికి తమ తాతయ్య పీవీ నరసింహారావు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం సంతోషంగా ఉందని పీవీ పెద్ద కుమార్తె శారదాదేవి కుమారుడు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో పురస్కారం ప్రదాన కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Published : 31 Mar 2024 05:15 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌

ఈనాడు, దిల్లీ: దేశ సర్వతోముఖాభివృద్ధికి తమ తాతయ్య పీవీ నరసింహారావు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం సంతోషంగా ఉందని పీవీ పెద్ద కుమార్తె శారదాదేవి కుమారుడు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో పురస్కారం ప్రదాన కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ క్షణాలు పీవీ కుటుంబ సభ్యులందరికీ ఎంతో మధురమైనవి. మేం చిన్నప్పటి నుంచి దిల్లీకి వస్తుండేవాళ్లం. తాతయ్య ఈ దేశానికి చేసిన సేవలను, ఆయన ఎదిగిన దశలను చూశాం. దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత గౌరవం పొందిన రాజకీయ నేత ఆయన. దేశం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారి ఆయన తనవంతు పాత్ర పోషించి వాటికి పరిష్కారం చూపారు. ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. ఆయన్ను చూసి మేం ఎన్నో నేర్చుకున్నాం. పీవీ అనంతరం వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయన అనుసరించిన ఆర్థిక, విదేశాంగ, అణు, ఇంధన, విద్యా విధానాలను కొనసాగించడం ఆ మహనీయుని దార్శనికతకు అద్దంపడతాయి’’ అని పేర్కొన్నారు. పీవీ మరో మనుమడు, భాజపా తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశం నుంచి తొలి ప్రధానమంత్రి అయిన పీవీకి భారతరత్న దక్కడం చాలా ఆనందదాయకం. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగి, అధికారంలో ఉన్నా లేకున్నా గాంధీ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న మహానుభావుడు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎలా అవమానించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూపీఏ-1, 2 ప్రభుత్వాల్లో భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరం’’ అని అన్నారు. పీవీ పెద్ద కుమార్తె శారదాదేవి మాట్లాడుతూ తన తండ్రికి భారతరత్న ప్రకటించి, ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రధానికి కృతజ్ఞతలు: కిషన్‌రెడ్డి

పీవీకి దేశ అత్యున్నత పౌరపురస్కారం దక్కడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయవాది, దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ పీవీని ఆయన కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని