ప్చ్‌.. ‘ముడి’పడడం లేదు!

ఉన్నత చదువులు.. సామాజిక మార్పులు వివాహ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలకు తగిన సంబంధాలు దొరకడం సమస్యగా మారింది.

Updated : 31 Mar 2024 07:06 IST

మారిపోతున్న పెళ్లి అభిరుచులు
కొన్నింట రాజీపడి ముందుకెళ్దామనుకుంటే కుదరని జాతకాలతో తంటా
అబ్బాయిలకే కాదు... అమ్మాయిలకూ తగిన సంబంధం దొరక్క తల్లిదండ్రుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత చదువులు.. సామాజిక మార్పులు వివాహ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలకు తగిన సంబంధాలు దొరకడం సమస్యగా మారింది. కులమతాల పట్టింపులు ఉన్నచోట్ల ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. జాతకాలు, కట్నకానుకలు, యువతీయువకుల ఎత్తు వంటివి కూడా బాగా ప్రభావం చూపుతున్నాయి. 18 ఏళ్లు నిండిన అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేయవచ్చని చట్టం చెపుతున్నా.. ఆ తరవాత మరో పదేళ్లయినా పెళ్లి కాని యువతీ, యువకులు ఎంతోమంది కనిపిస్తున్నారు. వారికి పెళ్లి సంబంధాల అన్వేషణలో తల్లిదండ్రులు అలసిపోతున్నారు. ఇటీవల దాకా రైతులు, వేద పండితులకు సంబంధాలు రావడం కష్టంగా ఉందనే పరిస్థితులు ఉండగా ఇప్పుడు వారి సరసన ఉన్నత చదువులు చదివి.. మంచి వేతన  ప్యాకేజీలతో ఉన్నతోద్యోగాలు చేస్తున్న యువతీ, యువకులు కూడా చేరుతున్నారని పలు మ్యారేజ్‌ బ్యూరోల ప్రతినిధులు ‘ఈనాడు’కు చెప్పారు. ‘‘తల్లిదండ్రుల్లో చాలామంది అమ్మాయి డాక్టరైతే... అబ్బాయి కూడా డాక్టరైతే బాగుంటుందని ఆలోచిస్తారు.

ప్యాకేజీ విషయంలోనూ అమ్మాయి కంటే అబ్బాయికి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి మరెన్నో అంశాలు వయసు మీరకుండా పిల్లల పెళ్లి చేసేయాలనే పెద్దల సంకల్పానికి చాలాచోట్ల అవరోధాలుగా పరిణమిస్తున్నాయి. ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా ఇప్పటికీ అత్యధిక శాతం కుటుంబాల వారు.. కులం, హోదా, జాతకాలు, ఆస్తులు, కట్నం వంటి విషయాల్లో ఏమాత్రం రాజీపడకపోవడం వల్ల పెళ్లిళ్లు చాలా ఆలస్యమవుతున్నాయి. కొన్ని కులాల్లో చూస్తే... ఒక కులంలో అనేక శాఖలు ఉంటాయి. కులం ఒకటైతే సరిపోదని.. శాఖ కూడా ఒకటే కావాలని పలువురు పేర్కొంటున్నారు. ఇలా వివిధ కారణాలతో సంబంధాలను తిరస్కరించడంతో పలువురు యువతీయువకులకు 30 ఏళ్లు దాటే వరకూ కూడా పెళ్లిళ్లు కావడం లేదని మా మ్యారేజ్‌ బ్యూరోల అంతర్గత సర్వేలు చెపుతున్నాయి. 30ఏళ్లు వచ్చిన తరవాత మెల్లగా రాజీపడటం మొదలవుతోంది’’ అని వారు వివరించారు.

నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నా...

గుంటూరుకు చెందిన ఓ అబ్బాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఎంటెక్‌ చదివాడు. నెలకు రూ.2 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర నుంచి సంబంధాలు వెదుకుతున్నా అమ్మాయి దొరకడం లేదని తండ్రి ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పెళ్లి సంబంధం గురించి మాట్లాడగానే ఎన్ని రూ.కోట్ల ఆస్తి ఉంది అని చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అడుగుతున్నారు. పెద్దగా ఆస్తి లేదనగానే కొంత మంది తిరస్కరించారు. ఇటీవల ఓ పేద కుటుంబానికి చెందిన బీటెక్‌ చదివిన అమ్మాయిని చేసుకుందామని అడిగితే అబ్బాయి అందంగా లేడని తిరస్కరించింది’ అని ఆయన వాపోయారు.

పెళ్లయ్యేనాటికి అన్ని హంగులు ఉండాలని...

ఇటీవలికాలంలో చాలామంది అబ్బాయిలు పెళ్లయ్యేనాటికల్లా రూ.లక్షల వేతనంతో ఉద్యోగంతోపాటు ఇల్లు, కారు వంటివన్నీ ఉండాలని 30 ఏళ్లు వయసు దాటేదాకా ఆగుతున్నారని మ్యారేజ్‌ బ్యూరోల వారు చెబుతున్నారు. అమ్మాయిలు కూడా పలు విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటున్నారని వారు కోరుకున్న సంబంధం వచ్చేదాకా ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తున్నారని వివరించారు. ‘విజయవాడకు చెందిన ఓ అమ్మాయి ఎంటెక్‌ చదివి ఉద్యోగం చేస్తోంది. పీజీ చదివి నెలకు రూ.లక్షకుపైగా సంపాదించే అబ్బాయిని మాత్రమే చేసుకుంటానని ఇప్పటికే 16 సంబంధాలను ఆమె తిరస్కరించింది’ అని వివరించారు.


మన దేశంలో 2020-21లో బీటెక్‌లో ఐటీ, కంప్యూటర్‌ కోర్సుల్లో 5.33 లక్షల మంది అబ్బాయిలు చేరగా, అమ్మాయిలు 3.44 లక్షల మంది చేరారని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాలు తెలియజేస్తున్నాయి.


ఐటీ, సాఫ్ట్‌వేర్‌లో అమ్మాయిల కొరత...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధిక శాతం అబ్బాయిలు బీటెక్‌ చదువుతుండగా.. వారిలో ఎక్కువమంది ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో స్థిరపడుతున్నారు. ఈ రంగాల్లో ఉన్న అమ్మాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటుండటంతో సంబంధాలు కుదరడం లేదు. మరోవైపు మంచి పేరున్న విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ చదివి వేతన ప్యాకేజీ బాగున్న అబ్బాయిలకు అదేస్థాయి అమ్మాయి దొరకడం చాలా కష్టంగా ఉండగా, దీనికి పూర్తి వ్యతిరేకంగా మెడిసిన్‌ చదివిన అమ్మాయికి అంతేస్థాయి అబ్బాయి దొరకడం కష్టంగా ఉంది.


నర్సింగ్‌ హోం కట్టిస్తారా?

మెడిసిన్‌ చదివిన అబ్బాయిలు తక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల.. ఎంబీబీఎస్‌, ఎండీ చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. ఎండీ చదివిన ఓ అమ్మాయికి ఇటీవల పేద రైతు కుటుంబానికి చెందిన ఓ మెడిసిన్‌ అబ్బాయి సంబంధం వచ్చింది. ‘‘మా అబ్బాయి ఎండీ చదివాడు కాబట్టి మా ఊర్లో స్థలం కొని నర్సింగ్‌హోం కట్టించి ఇవ్వాలి. రూ.ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? ఎంత కట్నం ఇస్తారు’’ అని అబ్బాయి తల్లి అడగటంతో ఏం చెప్పాలో అర్థం కాలేదని అమ్మాయి తండ్రి ‘ఈనాడు’కు తెలిపారు. దీంతో ఆ అబ్బాయికి రెండేళ్లుగా సంబంధం కుదరడం లేదని మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధి తెలిపారు.


సర్కారు నౌకరీకీ ఆకర్షణ లేదు...

ఒకప్పుడు ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగం చేసే అబ్బాయిని పెళ్లాడడానికి అమ్మాయిలు.. అల్లుడిగా తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపేవారు. ఇప్పడు పరిస్థితులు చాలావరకు మారాయని ఓ మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధి తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగులను పెద్దగా ఇష్టపడటం లేదని వివరించారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ)గా పనిచేస్తున్న భర్తకి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతోందని తెలిసి భార్య అయిన సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి మూడేళ్లకల్లా విడాకులకు దరఖాస్తు చేసి వెళ్లిపోయిందని ఆయన ఓ ఉదంతాన్ని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని