డోర్నకల్‌-గద్వాల వయా సూర్యాపేట

డోర్నకల్‌-గద్వాల ప్రతిపాదిత కొత్త రైలు మార్గం తుది సర్వే పనులు మొదలయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) మంజూరైంది.

Updated : 31 Mar 2024 04:54 IST

కొత్త రైలు మార్గం తుది సర్వే ప్రారంభం
దక్షిణ తెలంగాణకు కీలక మార్గం

ఈనాడు, హైదరాబాద్‌: డోర్నకల్‌-గద్వాల ప్రతిపాదిత కొత్త రైలు మార్గం తుది సర్వే పనులు మొదలయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) మంజూరైంది. దీని మొత్తం నిడివి 296 కి.మీ. ప్రాథమిక అంచనా వ్యయం రూ.5,300 కోట్లు. తుది సర్వే పూర్తయ్యాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. రైల్వేశాఖ గత సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే లైన్లకు తుది సర్వే మంజూరు చేయగా రాష్ట్రానికి సంబంధించి డోర్నకల్‌-గద్వాల వయా సూర్యాపేట మార్గం అందులో ఉంది. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, భూత్పూర్‌ పట్టణాల మీదుగా ఈ లైన్‌ వెళుతుంది. ఇది కార్యరూపం దాలిస్తే దక్షిణ తెలంగాణకు కీలకమవుతుంది. సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ వంటి జిల్లా కేంద్రాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

నిర్ణయం వచ్చే ఏడాదిలోనే!

డోర్నకల్‌-గద్వాల తుది సర్వేను రైల్వేశాఖ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. సర్వే కోసం రూ.7.40 కోట్లు కేటాయించారు. సిమెంట్‌, గ్రానైట్‌ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రతిపాదిత మార్గాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మార్కింగ్‌ చేస్తున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఈ సర్వే పనులు జరుగుతున్నాయి. 2025 ఫిబ్రవరిలో బడ్జెట్‌ నాటికి తుది సర్వే పూర్తయి.. ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు.


బోధన్‌-మహబూబ్‌నగర్‌, గుంతకల్లు-బోధన్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: బోధన్‌-మహబూబ్‌నగర్‌(07275) రైలును ఏప్రిల్‌ 2 నుంచి మే 1 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే గుంతకల్లు-బోధన్‌(07671) రైలును ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉదయం బోధన్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే రైలు, తిరుగు ప్రయాణంలో మాత్రం గుంతకల్లు నుంచి బయల్దేరుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు వేర్వేరు నంబర్లు కేటాయించారు. ఈ మార్గాల్లో కొనసాగుతున్న వివిధ పనుల కారణంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని