రాజకీయ ప్రముఖులకు త్వరలోనే నోటీసులు!

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు మళ్లుతోంది. ఓ ప్రధాన పార్టీ తరఫున పోలీసు వాహనాల్లో పెద్దఎత్తున నిధులు తరలించినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Published : 01 Apr 2024 05:50 IST

ఇందులో మాజీ మంత్రులు కూడా ఉండొచ్చని సమాచారం
నాడు పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు వైపు తిరుగుతున్న ‘ఫోన్‌ ట్యాపింగ్‌’

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు మళ్లుతోంది. ఓ ప్రధాన పార్టీ తరఫున పోలీసు వాహనాల్లో పెద్దఎత్తున నిధులు తరలించినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో గడచిన శాసనసభ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని తెలిసింది. ఇదే జరిగితే ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతం రాజకీయంగా మరింత సంచలనంగా మారుతుంది.

న్యాయపరమైన అంశాలపై చర్చలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై జరుపుతున్న విచారణలో భాగంగా హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రణీత్‌రావు ముఠా ప్రజాప్రతినిధుల ఫోన్లు, పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు, సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి, వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ట్యాపింగ్‌ దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు వారు కూడా మౌఖికంగా ఈ ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ అనుమానితుడు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రణీత్‌రావు తదితరులు ఫోన్లపై నిఘా ఉంచగా.. వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బు పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించినట్లు, పోలీసు వాహనాల్లోనే పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దమొత్తంలో నిధులు రవాణా చేసినట్లు గుర్తించారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందజేశామనే సమాచారం కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయాలు నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నారని భావిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులు న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్నారని, నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులు అందరినీ పిలిపించి విచారించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఉన్నతాధికారులు అంగీకరించే పక్షంలో రెండు మూడు రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.

బంజారాహిల్స్‌ ఠాణాకు వ్యాపారి

ఫోన్‌ ట్యాప్‌ చేసి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఆదివారం బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చి దర్యాప్తు బృందాన్ని కలిశారు. ప్రస్తుత కేసులోని నిందితుడొకరు తన ఫోన్‌ వాయిస్‌ రికార్డులను చూపించి మరీ తనను బెదిరించారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రంలోని తన స్నేహితుడితో మాట్లాడిన వాయిస్‌ రికార్డులు నిందితుడికి ఎలా వెళ్లాయో తేల్చాలని కోరినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని