టానిక్‌ ఏర్పాటు జీవోలోనే మతలబు!

హైదరాబాద్‌లోని టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు జీఎస్టీ, వ్యాట్‌, ప్రివిలేజ్‌ ఫీజుల్లో ఎగవేతలకు పాల్పడినట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Published : 01 Apr 2024 05:51 IST

ఎలైట్‌ షాప్‌ పేరిట వెసులుబాటుతో ఆదాయానికి గండి
జీఎస్టీ, వ్యాట్‌, ప్రివిలేజ్‌ ఫీజుల ఎగవేత
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల ప్రాథమిక నిర్ధారణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు జీఎస్టీ, వ్యాట్‌, ప్రివిలేజ్‌ ఫీజుల్లో ఎగవేతలకు పాల్పడినట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు ఆయా దుకాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని నిశితంగా పరిశీలించి.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చిన కారణంగా సర్కారు ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలపై రెండు శాఖలూ కూపీ లాగుతున్నాయి. అసలు ఆ జీవో ఇవ్వడంలోనే దురుద్దేశం ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. మరెవరికీ అవకాశం ఇవ్వకుండా కేవలం ఆ ఒక్క దుకాణానికి మాత్రమే ఎలైట్‌ షాప్‌ అనుమతి ఇవ్వడంలో మతలబుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.

మూడేళ్లపాటు ప్రివిలేజ్‌ ఫీజులో వెసులుబాటు

2016లో ఎలైట్‌ రూల్స్‌ పేరుతో ఇచ్చిన జీవో ద్వారా ఏర్పాటైన టానిక్‌ మద్యం దుకాణానికి మూడేళ్లపాటు ఎలాంటి ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో మరేదానికీ ఇలాంటి సదుపాయం లేదు. మిగిలిన దుకాణాలన్నీ రెండేళ్లకోసారి కొత్త లైసెన్స్‌ కోసం లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. టానిక్‌కు మాత్రం ఎలాంటి టెండర్‌ అవసరం లేకుండా ఏకంగా అయిదేళ్లపాటు లైసెన్స్‌ కట్టబెట్టారు. ఇందుకు పెద్దఎత్తున లైసెన్స్‌ ఫీజు వసూలు చేశారా అంటే అదీ లేదు. కేవలం రూ.15 లక్షలు అదనంగా చెల్లించినందుకు ఈ వెసులుబాట్లు కల్పించడం వెనక నాటి కీలక నేతల ప్రమేయముందనే అనుమానాలున్నాయి. మరోవైపు, సాధారణ దుకాణాలు ఏడాదిలో తమ లైసెన్స్‌ ఫీజు మొత్తానికి ఏడు రెట్ల విలువైన మద్యం విక్రయిస్తే.. తదుపరి చేపట్టే విక్రయాలపై ప్రభుత్వానికి 13.7 శాతం వరకు ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టానిక్‌కు మూడేళ్లపాటు ప్రివిలేజ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన తర్వాత కూడా లైసెన్స్‌ ఫీజుకు పది రెట్ల వరకు విక్రయించిన తర్వాతే ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. ప్రతి రెండేళ్లకోసారి వేలం నిర్వహిస్తే టానిక్‌ లాంటి ఎలైట్‌ షాప్‌ కోసం 200 వరకు దరఖాస్తులొచ్చేవని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల రూపంలోనే రెండేళ్లకోసారి రూ.4 కోట్ల వరకు నాన్‌-రిఫండబుల్‌ రుసుం దక్కకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా గడిచిన ఎనిమిదేళ్లలో టానిక్‌ నిర్వాహకులకు కల్పించిన వెసులుబాట్లతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. రెండు శాఖల నుంచి సమగ్ర నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు చేపట్టే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని