గత ప్రభుత్వ హయాంలో దేవుడి మాన్యాల కబ్జా

గత ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖలో మితిమీరిన అవినీతి, అక్రమాలు జరిగాయని, దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Published : 02 Apr 2024 05:14 IST

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

వేములవాడ, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖలో మితిమీరిన అవినీతి, అక్రమాలు జరిగాయని, దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల భూముల రికార్డులు పరిశీలించి ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉందో గుర్తిస్తామని, హద్దులు ఏర్పాటు చేయించి దేవుళ్ల పేరు మీదే పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. కబ్జాకు గురైన దేవుడి మాన్యాలపై విచారణకు ఆదేశిస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధికి నిధులిచ్చే భక్తుల కోసం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నట్లు చెప్పారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి పెద్దమొత్తంలో విరాళాలు సేకరిస్తామన్నారు. వీటితోపాటు దేవాదాయశాఖ, కేంద్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేస్తామని వివరించారు. దేవాలయాలకు కొత్త కమిటీలు నియమిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు  దోపిడీకి గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయాలకు సంబంధించిన పూజా సామగ్రి, సరకుల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, విచారణకు ఆదేశిస్తామని మంత్రి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు