రూ.71,300.. రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం రూ.71,300కు చేరింది.

Updated : 02 Apr 2024 06:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.64 వేలకు పైగా ఉంది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,300 ఉండేది. పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్‌ మారకపు విలువ బాగా   పెరగడంతో, ఇటీవల కాలంలో బంగారం  ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం  వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) ధర 2,165 డాలర్ల నుంచి 2,255 డాలర్లకు పెరగడం గమనార్హం. ఈ నెలలో వివాహాది శుభకార్యాల ముహూర్తాలు ఉండగా, పుత్తడి, వెండి ధరలు భారీగా  పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు తగ్గాయని విక్రయదారులూ చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో అక్షయ తృతీయ రోజున బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది. ఏడాది వ్యవధిలో సుమారు రూ.9 వేల వరకు పెరిగింది. కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నా, గత రెండు మూడు నెలల్లో మార్పు మరింతగా ఉన్నట్లు వర్తకులు చెబుతున్నారు.

20 ఏళ్లలో 1,129%..

2004 ఏప్రిల్‌ 22న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.5,800గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న (సోమవారం) రూ.71,300కు చేరింది. అంటే 20 ఏళ్లలో ధర 1,129.3% పెరిగింది. ఈనెల 26తో పెళ్లి ముహూర్తాలు ముగుస్తాయని పండితులు చెబుతున్నారు. వచ్చేవారం అమావాస్య తర్వాత ఒకటీ రెండు ముహూర్తాలతో పాటు శ్రీరామనవమి నుంచి మరికొన్ని శుభ ముహూర్తాలున్నాయి. ఈ కొద్ది రోజుల్లోనూ పెద్దసంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 26 నుంచి మూఢం ప్రారంభం అవుతుంది. తదుపరి 3 నెలల పాటు వివాహాలకు అవకాశం ఉండదు.


45 రోజుల్లో ధర 15% పెరిగింది

బంగారం ధర గత 45 రోజుల్లోనే 15 శాతానికి పైగా పెరిగింది. ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగానే ఉన్నా, కొనుగోళ్లు మందగించాయి. పలువురు తాము కొనుగోలు చేయాలనుకున్న మొత్తంలో 50-60 శాతమే కొంటున్నారు. ధరలు కొంత తగ్గాక, మిగిలిన బంగారం కొంటామని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో జరిగే విక్రయాల్లో 40% వ్యాపారం తగ్గింది. ధర ఎక్కడి దాకా పెరుగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? అన్నది అంచనా వేయడం కష్టంగా ఉంది.

 ప్రవీణ్‌కుమార్‌, హైదరాబాద్‌ బంగారం వర్తకుల సంఘ ప్రధాన కార్యదర్శి


అంతర్జాతీయ పరిణామాలతోనే..

అంతర్జాతీయ అనిశ్చితులు పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే, బంగారంపై పెట్టుబడులు పెడతారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ప్రకటించినందున, పసిడిపైకి మదుపర్ల దృష్టి మళ్లుతోంది. మనదేశంలో బంగారాన్ని సెంటిమెంట్‌గా కొనుగోలు చేస్తారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో, తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిది. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిది.

 నమశ్శివాయ రేణికుంట్ల, డైరెక్టర్‌, జెన్‌ సెక్యూరిటీస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు