కవిత బెయిల్‌పై విచారణ 4కి వాయిదా

దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది.

Updated : 02 Apr 2024 05:21 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది. గత నెల 15న హైదరాబాద్‌లో అరెస్ట్‌ అయిన కవిత బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ సోమవారం కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘ఈడీ హింసించే వ్యవస్థలా వ్యవహరిస్తోంది. కేసు దర్యాప్తు దురుద్దేశపూర్వకంగా సాగుతోంది. న్యాయం, నిష్పాక్షికత లేదు. ఈ కేసులో కవితను అరెస్ట్‌ చేయాల్సిన అవసరమే లేదు. అరుణ్‌ పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు. 2022 నవంబరు 11న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తర్వాత ఆయన వెనక్కు తీసుకున్నారు. ఆ అరెస్ట్‌ చేసే అధికారం ఉన్నా అందుకు ఆధారాలు చూపాలి. ఈడీ ఎన్నో ఛార్జిషీట్లు దాఖలు చేసినా ఎందులోనూ పిటిషనర్‌ను నిందితురాలిగా పేర్కొనలేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు సమన్లు జారీ చేసింది. ఒకేరోజు తొలుత ఇచ్చిన సమన్‌పై ఇంకు కూడా ఆరకముందే మరొకటి ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసే వేధింపు తప్పితే ఇంకోటి కాదు. కోర్టులు, రాజ్యాంగానికి అతీతమన్నట్లు ఈడీ వ్యవహరిస్తోంది. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట తప్పింది. మార్చి 15 వరకు ఆ హామీ అమల్లో ఉన్నప్పటికీ పాటించలేదు’’ అని సింఘ్వీ పేర్కొన్నారు.

ఈ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ తోసిపుచ్చారు. సింఘ్వీ మధ్యంతర బెయిల్‌ కోసం వాదిస్తున్నారో లేదా సాధారణ బెయిల్‌ కోసం వాదిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘‘రెగ్యులర్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకొని.. మధ్యంతర బెయిల్‌ అడగడానికి వీల్లేదు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సాధారణ బెయిల్‌పై వాదించాలి. లేదా మధ్యంతర ఉపశమనం వరకే పరిమితం కావాలి. రెండింటినీ కలపకూడదు’’ అని హుస్సేన్‌ పేర్కొన్నారు. కవిత బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌ను న్యాయమూర్తికి ఆయన అందించారు. దానిపై తమ సమాధానం చెప్పడానికి 3వ తేదీ వరకు సమయం ఇవ్వాలని సింఘ్వీ కోరడంతో అందుకు న్యాయమూర్తి కావేరీ బవేజా అనుమతించారు. తదుపరి విచారణను 4వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న తనకు ఇంటి భోజనం, జపమాల, లేస్‌లు లేని బూట్లు, దినపత్రికలు అనుమతించాలని కవిత పెట్టుకున్న దరఖాస్తుపై న్యాయమూర్తి కావేరి బవేజా సానుకూలంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని