తెలుగు నేలకు ఎండదెబ్బ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణ మార్పులు.. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Published : 04 Apr 2024 03:08 IST

రెండు రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం
తెలంగాణలో తాజాగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
గత 53 ఏళ్ల పరిస్థితులపై క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ అధ్యయనం
తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణ మార్పులు.. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్‌ మొదటి రెండు మూడు రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చిలో రెండు వారాలు కొంత ఊరట ఇచ్చినా.. చివరి వారం నుంచి మళ్లీ మంటలు మొదలయ్యాయి. రెండు మినహా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం రాష్ట్రమంతటా ఎండల తీవ్రతను స్పష్టం చేస్తోంది. నిర్మల్‌, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా తీవ్రమైన వేడి కొనసాగుతోంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే సూచించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత కొనసాగనుందని హెచ్చరించింది.

క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం ఇలా..

గత ఐదు దశాబ్దాల కాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్‌ సెంట్రల్‌ తాజాగా విశ్లేషించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలను వివరించింది. వాతావరణ మార్పుల సూచిక (సీఎస్‌ఐ) ద్వారా ప్రాంతాల వారీగా అధ్యయనం చేసింది. జనవరి 1, 1970 నుంచి జూన్‌ 30 2023 వరకు 53 ఏళ్లపాటు.. భారతదేశంలో ఉష్ణోగ్రతల మార్పులను అత్యాధునిక కంప్యూటర్‌ విధానంలో విశ్లేషించింది. భారత్‌లో చిన్న ప్రాంతాలైన చండీగఢ్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన తీరును అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1970వ సంవత్సరం వేసవి నుంచి 2023 ఏప్రిల్‌-జూన్‌ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 1970తో పోలిస్తే.. గత ఏడాది తెలంగాణలో 0.5 డిగ్రీలు, ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో ఉండగా, తెలంగాణ 28వ స్థానంలో ఉంది. మానవ ప్రమేయం వల్ల వాతావరణంలో కలిగే మార్పులు.. ఉష్ణోగ్రతల పెరుగుదలకు అధికంగా కారణమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. 


ఇంకా పెరిగే అవకాశం

 ఆండ్రూ పెర్‌షింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, క్లైమేట్‌ సెంట్రల్‌, అమెరికా

అత్యధిక ఉష్ణోగ్రతలకు వాతావరణ మార్పులే కారణం. భారత్‌లో తీవ్రమైన ఎండల సీజన్‌ కొనసాగనుంది. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో సగటు కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల.. ఇటువంటి పరిస్థితులు ఇంకా ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది.


ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువే

 ఎ.శ్రావణి, సీనియర్‌ వెదర్‌ ఆఫీసర్‌, వాతావరణశాఖ, హైదరాబాద్‌

ఈ ఏడాది పూర్తిస్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో పాటు మధ్య భారతంలో తుపాను వ్యతిరేక పరిస్థితులు కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఎల్‌ నినో ప్రభావంతో ఈసారి ఫిబ్రవరి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి చివరి నుంచి దాని ప్రభావం మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ మూడు, నాలుగు వారాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. అవి మే నెలలో కూడా కొనసాగుతాయి. ఈసారి 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రుళ్లు ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని