సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పేరుతో రూ.10 లక్షల డిమాండ్‌

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం పేరుతో పెద్దపల్లి భారాస అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను రూ.10 లక్షలు డిమాండ్‌ చేసిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పడకల్‌కు చెందిన నిమ్మ భరత్‌పై గోదావరిఖని ఒకటో పట్టణ ఠాణా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

Published : 11 Apr 2024 03:52 IST

మాజీ మంత్రి కొప్పుల ఫిర్యాదుతో కేసు నమోదు

గోదావరిఖని, వెల్గటూరు, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం పేరుతో పెద్దపల్లి భారాస అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను రూ.10 లక్షలు డిమాండ్‌ చేసిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పడకల్‌కు చెందిన నిమ్మ భరత్‌పై గోదావరిఖని ఒకటో పట్టణ ఠాణా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని 15 రోజుల క్రితం నిమ్మ భరత్‌ అనే వ్యక్తి నా వద్దకు వచ్చాడు. ప్రస్తుతం ప్రచారం మొదలు పెట్టలేదని, అవసరం ఉంటే సాయం తీసుకుంటానని చెప్పి పంపించా. అతని నుంచి నేను ఎలాంటి సహాయం తీసుకోలేదు. అయినా ఈ నెల 7న రూ.10 లక్షలు చెల్లించాలని నిమ్మ భరత్‌ వాట్సప్‌ ద్వారా నాకు సందేశం పంపించాడు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు తన ఖాతాలో నగదు జమ చేయకుంటే ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు’’ అని కొప్పుల ఈశ్వర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిమ్మ భరత్‌ ఫిర్యాదుతో..

నిమ్మ భరత్‌ ఫిర్యాదు మేరకు అదే మండలానికి చెందిన మూగల సత్యం, పెద్దూరి భరత్‌లపై కేసు నమోదైనట్లు ఎస్సై ఉమాసాగర్‌ బుధవారం రాత్రి తెలిపారు. కొప్పుల ఈశ్వర్‌కు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పనిచేసేందుకు తనకు రూ.పది లక్షలకు ఒప్పందం కుదిరిందని, ఇందులో రూ.50 వేలే ఇచ్చారని, మిగతా డబ్బులు అడిగితే కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తనపై తప్పుడు పోస్టులు పెట్టించారని నిమ్మ భరత్‌ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా భారాస నాయకులు మూగల సత్యం, పెద్దూరి భరత్‌లు తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని