బడి ఈడులో జబ్బు.. నడి వయసులో ముప్పు!

ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

Updated : 12 Apr 2024 07:34 IST

చిన్నప్పటి అనారోగ్యం.. పెద్దయ్యాక దుష్ప్రభావం
25 శాతం మందిలో రెండు.. అంతకంటే ఎక్కువ జబ్బులు
బాధితుల్లో మహిళలే అధికం
50 ఏళ్లు దాటిన వారిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం
తాజాగా బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితం

ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందిలో 21 మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే.. పట్టణ వాసుల్లో ఆ సంఖ్య 35గా ఉంది.

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నతనంలో తరచూ అస్వస్థతకు గురయ్యేవారా? తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడి.. నెల రోజులకు పైగా బడికి వెళ్లలేకపోయారా? అయితే ఇలాంటి వారు నడివయసు దాటాక బహుళ (రెండు.. అంతకంటే ఎక్కువ) దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు పొంచి ఉంది. బాల్యంలో ఏవైనా జబ్బులతో బాధపడి.. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో 25 శాతం మందికి బహుళ వ్యాధులు సోకుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, క్యాన్సర్‌, పక్షవాతం, మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్షయ, ఎముకల బలహీనత, అధిక కొలెస్ట్రాల్‌, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాల నోటి వ్యాధులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికం. ‘బాల్యంలో అనారోగ్యం.. నడి వయసులో దాని దుష్ప్రభావం’ అనే అంశంపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన పత్రం తాజాగా ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ (బీఎంజే)’లో ప్రచురితమైంది.

అధ్యయనం సాగిందిలా..

దేశవ్యాప్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక్కొక్క విభాగం/అంశం వారీగా ప్రతి 100 మందిలో ఎంత మంది ఉన్నారని లెక్కగట్టారు. 50 ఏళ్లు పైబడిన 51,481 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో 50-59 ఏళ్ల మధ్య వయస్కులు 19,835 (38.53 శాతం), 60-69 ఏళ్ల వారు 18,807 (36.53 శాతం), 70 ఏళ్లు పైబడినవారు 12,839 (24.94 శాతం) మంది ఉన్నారు. వీరిలో పురుషులు 23,942 (46.51 శాతం), మహిళలు 27,539 (53.49 శాతం).

ప్రస్తుతం వారిలో ఏయే జబ్బులున్నాయో అధ్యయనంలో ప్రధానంగా కనుక్కున్నారు. చిన్నతనంలో ఏవైనా జబ్బుల బారినపడ్డారా? అని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య కారణాలతో బాల్యంలో నెల రోజులు.. అంతకంటే ఎక్కువ రోజులు పాఠశాలకు వెళ్లకుండా ఉండాల్సి వచ్చిందా? అనేది ఆరా తీశారు. వారి ప్రస్తుత, బాల్యంలోని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. వీటన్నింటి మధ్య సారూప్యతను విశ్లేషించారు.

ఆటలు తగ్గినా ముప్పే

జీవనశైలి వ్యాధులకు చిన్నప్పటి జీవన విధానం కూడా ఒక కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. బాల్యంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 33 శాతం మందిని 50 ఏళ్లు దాటాక జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టాయి. బాల్యంలో ఆటలకు దూరంగా ఉండడం, సుకుమారంగా పెరగడం, నడక, పరుగు తదితర శారీరక శ్రమ తెలియకపోవడం వల్ల వయసు పెద్దయ్యాక వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అధ్యయనం విశ్లేషిస్తోంది. చిన్నతనంలో పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం మందికి.. 50 ఏళ్లు దాటాక బహుళ వ్యాధులు సోకినట్లు తేలింది. ప్రస్తుత ఆర్థిక స్థితి బాగా ఉన్నవారినీ దీర్ఘకాలిక వ్యాధులు  వేధిస్తున్నాయి.


పరిశోధన ఫలితాలు ఇలా..
50 ఏళ్లు పైబడిన వారిలో..

  • 45% మందికి దీర్ఘకాలిక వ్యాధులు లేవు.
  • ఒకే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వారు 30 శాతం, బహుళ వ్యాధిగ్రస్థులు 25 శాతం.
  •  బాల్యంలో అనారోగ్యం వల్ల నెల రోజులకు పైగా బడికి గైర్హాజరైన వారు 53 శాతం.
  • వీరిలో 50 ఏళ్లు దాటాక.. బహుళ దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించిన వారు 35 శాతం.
  • బాల్యంలో ఆరోగ్యం బాగున్న వారిలోనూ.. 50 ఏళ్లు దాటాక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారు 24 శాతం.
  • వివాహితుల్లో 24 శాతం.. అవివాహితులు, జీవిత భాగస్వామి లేని వారిలో 27 శాతం బహుళ వ్యాధులకు గురయ్యారు.
  • ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న వారిలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 17 శాతం, పని చేయకుండా ఉన్న వారిలో 31.8 శాతం మంది వ్యాధులబారిన పడ్డారు.
  •  వయసు పెరుగుతున్నకొద్దీ బహుళ దీర్ఘకాలిక జబ్బులు సోకే వారి సంఖ్య పెరుగుతోంది.


అతి పేదరికంలో ఉన్నవారిలో.. ఇప్పుడు బహుళ జబ్బులు 18 శాతం, పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం, మధ్యతరగతి ఆర్థిక స్థితి ఉన్న వారిలో 25 శాతం, ధనవంతుల్లో 28 శాతం, బాగా ధనవంతుల్లో 36 శాతం మందికి.. రెండు అంత కంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నట్లు గుర్తించారు.


బాల్యంలో ఆరోగ్య సంరక్షణ ముఖ్యం

బాల్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. 18 ఏళ్ల లోపు పిల్లలు వారానికి కనీసం ఐదు రోజులు.. మొత్తం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. అలా చేయని పిల్లలు మన దేశంలో 80 శాతం మంది ఉన్నారు. బాల్యంలో శారీరక శ్రమ చేయని వారికి భవిష్యత్తులో దీర్ఘకాలిక జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పత్రం చెబుతోంది. పేదరికంలో ఉన్నవారు సహజంగా శారీరక శ్రమ చేస్తారు. అందుకే 50 ఏళ్లు దాటాక తక్కువగా దీర్ఘకాలిక జబ్బుల బారిన పడతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో వ్యాయామం తక్కువ కావడంతో వారిలో పెద్దయ్యాక దీర్ఘకాలిక జబ్బులు పెరుగుతున్నాయని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపం వల్ల కూడా తరచూ అనారోగ్యం బారినపడుతుంటారు. శిశువు పుట్టిన తొలి 1000 రోజుల్లో ఇచ్చే ఆహారం, టీకాలు, ఆరోగ్య సంరక్షణ ఎలా ఉంటుందో.. ఆ ప్రభావం తర్వాత వయసులో కనిపిస్తుంది. బాల్యంలో శుభ్రత కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.

 డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని