ఎన్నికలయ్యాకే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు

ఇళ్లకు ఉచిత విద్యుత్తు ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిపివేశారు.

Updated : 12 Apr 2024 03:53 IST

‘ఉచిత కరెంటు’కు నమోదు నిలిపివేత
ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారికి లబ్ధి కొనసాగింపు
డిస్కంలకు రాయితీ సొమ్ము రూ.200 కోట్ల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్లకు ఉచిత విద్యుత్తు ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిపివేశారు. కోడ్‌ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులను ఆమోదిస్తామని ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు స్పష్టం చేశాయి. ‘గృహజ్యోతి’ పథకం కింద గత నెలలో మొదటిసారి 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు జారీ అయ్యాయి. మరో 7 లక్షల ఇళ్ల కనెక్షన్లు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల సాధ్యం కాలేదు. వీటితో కలిపి రాష్ట్రంలో తొలి నెల 43 లక్షల మందికి ఈ పథకం కింద అర్హత లభించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్‌ కార్డులున్నందున మిగిలిన వారు తమపేరు కూడా నమోదు చేయాలని దరఖాస్తులిస్తున్నా.. ఎన్నికల కోడ్‌ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు. గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి ఈ నెలలోనూ యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వీరి బిల్లుల మొత్తం సొమ్ము రూ.125 కోట్ల దాకా ఉంది. దీంతో పాటు ఏప్రిల్‌ నెల అవసరాలకు కూడా కలిపి రాయితీ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు డిస్కంలకు తాజాగా విడుదల చేసింది.

రూ.300 కోట్లకు చేరనుందా!

రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్లకు పైగా ఇళ్లలో కరెంటు వినియోగం ఉంది. వీటిలో దాదాపు 80 లక్షల ఇళ్లకు ప్రస్తుతమున్న రేషన్‌కార్డుల ప్రకారం గృహజ్యోతి పథకం వర్తిస్తుందని డిస్కంల పరిశీలనలో గుర్తించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత వచ్చే జూన్‌లో కొత్త దరఖాస్తులను కూడా నమోదు చేస్తే నెలకు దాదాపు రూ.300 కోట్ల వరకూ జీరో బిల్లుల రాయితీ సొమ్మును ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. వేసవి అయినందున మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జారీ కానున్న బిల్లులను పరిశీలిస్తే ఒక్కో ఇంటికి ఎంత వినియోగం ఉంటుందో అవగాహన వస్తుందని దక్షిణ తెలంగాణ డిస్కం సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ చెప్పారు. 200 యూనిట్లలోపు వాడే ప్రతి ఇంటి కనెక్షన్‌కు రేషన్‌కార్డు ఉంటే జీరో బిల్లు తప్పకుండా ఇస్తామని, ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఒక రేషన్‌కార్డు నంబరుతో ఒకటి కంటే ఎక్కువగా కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఒకటే కనెక్షన్‌కు జీరో బిల్లు ఇస్తున్నారు. మిగిలిన కనెక్షన్లకు కూడా జీరోబిల్లు రావాలంటే.. ఆ కుటుంబంలో వేరు కాపురం ఉంటున్న కుటుంబ సభ్యులు కొత్త రేషన్‌కార్డు తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. గత నెలలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కేవలం రెండుచోట్ల బిల్లు జారీ యంత్రాల్లో లోపాల వల్ల జీరో బిల్లు జారీ అయిందని, కానీ అక్కడ అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని తెలిసి తరువాత వాటిని మార్చి సాధారణ బిల్లు ఇచ్చినట్లు ఫారూఖీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని