సైబర్‌ ఠాణాల్లో కేసులు షురూ

తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో కేసుల నమోదు ఆరంభమైంది.

Published : 12 Apr 2024 03:54 IST

ఎఫ్‌ఐఆర్‌ల నమోదు ప్రారంభం
ఎస్‌హెచ్‌వోలుగా ఏసీపీలకు బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో కేసుల నమోదు ఆరంభమైంది. న్యాయస్థానాల పరిధి ఖరారవడంతో ఇటీవలే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు శ్రీకారం చుట్టారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ పోలీస్‌శాఖ టీఎస్‌సీఎస్‌బీని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం కేంద్రంగా ఏర్పాటైన ఈ వ్యవస్థ 1930 నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను పర్యవేక్షిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్‌ నేరాలు పెరుగుతుండటంతో అక్కడ కేసుల్ని వీలైనంత తొందరగా కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో అధకారులు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని టీఎస్‌సీఎస్‌బీ హెడ్‌క్వార్టర్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో 7 ఠాణాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారిని ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ఈ ఠాణాలు ప్రత్యేకించి సైబర్‌ నేరాలను మాత్రమే పర్యవేక్షించనున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 20 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో మాత్రమే సైబర్‌ కేసులు నమోదు చేసేవారు. మిగిలిన ఆరు కమిషనరేట్లలో సైబర్‌క్రైమ్‌ సపోర్ట్‌ సెంటర్లు ఉండేవి. ఆయా కమిషనరేట్‌ల పరిధిలోని శాంతిభద్రతల ఠాణాలో నమోదయ్యే సైబర్‌ నేరాలకు సంబంధించి సాంకేతిక సహకారాన్ని ఈ సపోర్ట్‌ సెంటర్లు అందించేవి.

ట్రేడింగ్‌లో లాభాలొచ్చేలా చేస్తామని టోకరా

హైదరాబాద్‌ హెడ్‌క్వార్టర్‌లోని సైబర్‌క్రైమ్‌ ఠాణా పోలీసులు ఇటీవల తొలికేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల మేరకు.. సైదాబాద్‌కు చెందిన ఓ డెంటిస్ట్‌ ఫోన్‌నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గత డిసెంబరు 16న పటేల్‌ అకాడమీ అనే వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చారు. షేర్ల ట్రేడింగ్‌లో తాము నిపుణులమని.. పెట్టుబడిదారులకు మెలకువలు నేర్పించి భారీగా లాభాలొచ్చేలా సలహాలిస్తామని చెప్పారు. వచ్చే లాభాల్లో 15-30శాతం వాటా తీసుకుంటామని తెలిపారు. జిగ్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక డెంటిస్ట్‌ ఫిబ్రవరి 20 నుంచి నెల రోజుల్లోపు 15 విడతల్లో రూ.1.25 కోట్లను ఆరు బ్యాంకు ఖాతాల్లోకి పంపించారు. ఆ తర్వాత వాట్సప్‌ గ్రూప్‌ నుంచి ఆ డెంటిస్ట్‌ నంబరును తొలగించారు. అంతక్రితం మాట్లాడిన వారి ఫోన్‌ నంబర్లు కూడా పనిచేయడం మానేశాయి. దాంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని