ముందే ఎండిపోతున్న కంకులు

యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. సీజన్‌ ఆరంభం నుంచీ చీడపీడలు పంటను వెంటాడుతుండగా, ప్రస్తుతం 17-18 జిల్లాల్లో పంట చివరిదశలో తెగుళ్లు వ్యాపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

Published : 12 Apr 2024 04:03 IST

మక్క పంటకు తెగుళ్ల బెడద
ఎకరాకు 10 క్వింటాళ్ల వరకూ తగ్గుతున్న దిగుబడి

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. సీజన్‌ ఆరంభం నుంచీ చీడపీడలు పంటను వెంటాడుతుండగా, ప్రస్తుతం 17-18 జిల్లాల్లో పంట చివరిదశలో తెగుళ్లు వ్యాపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 30 క్వింటాళ్లే వస్తోందని చెబుతున్నారు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. కోళ్లు, పశువులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యం పెరిగింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఈ యాసంగిలో పలుచోట్ల మక్కల వైపు మొగ్గుచూపారు.

6.66 లక్షల ఎకరాల్లో సాగు

యాసంగిలో మక్కల సాగు సాధారణ లక్ష్యం 5,11,521 ఎకరాలు కాగా... రైతులు 6,66,772 ఎకరాల్లో పంటను వేశారు. ఆరంభంలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగులు వ్యాపించాయి. ప్రస్తుతం వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంట కంకుల దశలో ఉండగా.. ఎండు తెగులు వ్యాపించింది. కంకులు పూర్తిస్థాయిలో పెరగకుండానే.. ఎండిపోయి రాలిపోతున్నాయి. మరోవైపు కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పాలకంకులు తయారవుతుండగా... వాటిలో పాముపొడ, మచ్చ తెగులు వ్యాపించాయి. దీంతో కంకి ఎదుగుదల కోల్పోతోంది. పంటలను రక్షించుకునేందుకు పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం అంతగా ఉండడం లేదని రైతులు చెబుతున్నారు.

దిగుబడిపై ప్రభావం

మొక్కజొన్న ఎకరానికి సాధారణంగా 40 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది. ప్రస్తుతం తెగుళ్లు వ్యాపించినచోట 30 క్వింటాళ్లు, అంతకంటే తక్కువ దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఎకరంలో సగం మేరకు పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వ్యవసాయ శాఖ అప్రమత్తం

ఈ సమస్యపై వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రధానంగా మక్క కంకి ఎదిగే దశలో ఉన్న చోట ఆశిస్తున్న పాముపొడ, మచ్చ తెగుళ్లపై రైతులను చైతన్యవంతం చేయాలని సూచించింది. పంట క్షేత్రాలను సందర్శించి తెగుళ్ల నివారణ చర్యలను వెల్లడించాలని పేర్కొంది. 

పెట్టుబడి వచ్చేలా లేదు

వరి కంటే మొక్కజొన్న మేలనుకొని సాగు చేశా. ఆది నుంచి తెగుళ్ల బాధతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎండు తెగులు బాగా దెబ్బతీసింది. పెట్టుబడి అయినా వస్తుందో రాదోననే అనుమానం ఉంది.

 రాజమౌళి, రైతు, దుగ్గొండి, వరంగల్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని