ఆరంభంలోనే.. అట్టహాసంగా

లోక్‌సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated : 14 Apr 2024 06:50 IST

ఈ నెల 18 నుంచి నామినేషన్లు
తొలి రోజుల్లోనే అత్యధికంగా దాఖలయ్యే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభం అవుతుంది. 25 వరకు కొనసాగుతుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. 25 వరకు గడువు ఉన్నా ఎక్కువమంది తొలి రోజుల్లోనే దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజులు మంచివిగా భావిస్తున్నారు. ఈ సారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలు నామినేషన్ల ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరుగుతున్న అతి ప్రధానమైన ఎన్నికలు కావడంతో సత్తా చాటేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఈ ఘట్టాన్ని జనాల్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌, భారాస, భాజపా... ఈ మూడు పార్టీలు మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలకు ఇప్పటికే పేర్లను ప్రకటించింది. ఒకటిరెండు రోజుల్లో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌లకూ వెల్లడించే అవకాశం ఉంది. భారాస, భాజపా మొత్తం స్థానాలకు ప్రకటించాయి. పోటీచేసే వారిని చాలాచోట్ల నిర్ణయించేయడంతో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా నామినేషన్లకు పక్కాగా ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలిగిందని అభ్యర్థులు భావిస్తున్నారు. ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నామినేషన్లకు సీఎం, మంత్రులు.. కేటీఆర్‌, హరీశ్‌

కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్‌, భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. భారాస అభ్యర్థుల నామినేషన్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఇతర నేతలు పాల్గొననున్నారని పార్టీ నేతలు తెలిపారు.

భాజపా రాష్ట్రాల సీఎంలు లేదా కేంద్ర మంత్రులు

భాజపా అభ్యర్థుల నామినేషన్ల అంశాన్ని జాతీయ పార్టీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమాలలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లేదా కేంద్రమంత్రి ఒకరు స్వయంగా పాల్గొనేలా కార్యక్రమం రూపొందించారు. 17 మంది లోక్‌సభ అభ్యర్థుల కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటారనే అంశం రెండు రోజుల్లో ఖరారవుతుందని పార్టీ నేతలు తెలిపారు. భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి కీలక నేతలు హాజరుకానున్నారు.


కీలక నేతలు సిద్ధం..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఈ నెల 19న నామినేషన్‌ వేయనున్నారు. పార్టీ ముఖ్యనేతలు డి.కె.అరుణ, ఈటల రాజేందర్‌లు 18న దాఖలు చేయనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి 19న, భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 22న వేయనున్నారు. ఖమ్మం భారాస అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు 24న,  ఆ పార్టీ ముఖ్యనేత, కరీంనగర్‌ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ 20న దాఖలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని