చీకటి రాత చెరిపేశాడు.. కొత్త ‘గీత’ గీశాడు

తన కాళ్లపై తాను నిలబడాలన్న ఆ యువకుడి ఆలోచన ముందు అతని బతుకులోని చీకటి ఓడిపోయింది.

Published : 14 Apr 2024 04:57 IST

తన కాళ్లపై తాను నిలబడాలన్న ఆ యువకుడి ఆలోచన ముందు అతని బతుకులోని చీకటి ఓడిపోయింది. కళ్లు కనిపించకున్నా.. తన సంపాదనతో కుటుంబానికి వెలుగు చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడీ ఆదివాసీ యువకుడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం చింతగుప్ప సమీపంలోని తుమలపాడ్‌ గ్రామానికి చెందిన మడకం పొజ్జాకు పుట్టుకతోనే కళ్లు లేవు. తన స్నేహితులంతా వివిధ పనులకు వెళ్లి సంపాదిస్తుంటే.. తాను ఇంట్లోనే కూర్చుని ఉండటం అతని మనసును తొలచివేసేది. తానూ కష్టపడి పనిచేయాలని భావించాడు. ప్రమాదమని తెలిసినా 2010లో తాటిచెట్లు ఎలా ఎక్కాలో నేర్చుకోవడం ప్రారంభించాడు. తొలినాళ్లలో ఇబ్బంది పడ్డాడు. అయినా పట్టు వదల్లేదు. అతని సంకల్పం ముందు కష్టాలు బలాదూర్‌ అయ్యాయి. చెట్టు ఎక్కి కల్లు గీయడమే కాదు.. చూపు ఉన్నవారితో సమానంగా ఒడుపుగా కల్లు గీయటంలో ప్రావీణ్యం సాధించాడు. స్వగ్రామంలో ఉపాధి లేక కొంతకాలం క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సోయం గంగులునగర్‌కు వలస వచ్చాడు. ఇక్కడ తాటికల్లు గీసి.. విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వేసవి మినహా మిగిలిన సమయాల్లో ఉపాధి లభించడం లేదని.. ప్రభుత్వం పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.    

న్యూస్‌టుడే, ములకలపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని