కొలిక్కిరాని కోటిపల్లి వాగు ‘కోట్లా’ట!

వికారాబాద్‌ జిల్లాలోని కోటిపల్లి వాగు మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రక్రియ పనుల ప్రతిపాదనలు కొలిక్కిరావడం లేదు. 2022 నుంచి ప్రతిపాదనల దశలోనే ప్రక్రియ నిలిచిపోతోంది.

Published : 14 Apr 2024 03:38 IST

2023 ఆగస్టులో రూ.38 కోట్లకు ప్రతిపాదనలు
ఈ ఏడాది మార్చిలో రూ.64 కోట్లకు పెరుగుదల
ప్రాజెక్టు ఆధునికీకరణ అంచనాల తీరు

ఈనాడు, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలోని కోటిపల్లి వాగు మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రక్రియ పనుల ప్రతిపాదనలు కొలిక్కిరావడం లేదు. 2022 నుంచి ప్రతిపాదనల దశలోనే ప్రక్రియ నిలిచిపోతోంది. భారీగా నిధులు అవసరమంటూ క్షేత్రస్థాయి నుంచి అంచనాలు వస్తుండగా.. వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో ఇప్పటికీ తేలడం లేదు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖను వికారాబాద్‌ ఎమ్మెల్యే, శాసనసభాపతి ప్రసాద్‌కుమార్‌ గత మార్చి నెలలో కోరడంతో దస్త్రం తిరిగి తెరపైకి వచ్చింది. అయితే, 2022 నుంచి పొంతన లేకుండా అంచనాలు వస్తుండటంతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

సగం ఆయకట్టుకూ అందని నీరు

వికారాబాద్‌ జిల్లా ధరూరు, పెద్దేముల్‌ మండలాల్లోని 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 1962లో కాగ్నా నదిపై కోటిపల్లి వాగు ప్రాజెక్టు నిర్మించారు. రెండు టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆధునికీకరించలేదు. కాలువలు, తూములు చాలావరకు శిథిలమయ్యాయి. వాటిని బాగు చేయాల్సి ఉంది. కట్టకు మరమ్మతులు అవసరం. వీటి దుస్థితి కారణంగా ప్రస్తుతం సగం ఆయకట్టుకు కూడా సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు.

ప్రతిపాదనల మధ్య పొంతనేదీ?

ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై ఇంజినీర్లు పంపుతున్న ప్రతిపాదనల మధ్య పొంతన ఉండటం లేదు.

  • 2022 జూన్‌ 28న అప్పటి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టాలంటూ నాటి సీఎంకు లేఖ రాశారు. 2011-12లో జైకా నిధులు రూ.24.75 కోట్లకు ప్రతిపాదనలు పంపినా.. మంజూరు కాలేదని పేర్కొన్నారు. డ్యాం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు.
  • 2022 జూన్‌ 29న సీఈ కార్యాలయం(హైదరాబాద్‌) రూ.124.95 కోట్లు మంజూరు చేయాలంటూ నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది.
  • 2022 సెప్టెంబరు 21న ఈ ప్రాజెక్టుపై అధ్యయనానికి నీటిపారుదల శాఖ సలహాదారు, సీడీవో విభాగాల అధికారులను ఈఎన్సీ పంపించారు. పరిశీలనల అనంతరం ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.39.32 కోట్లు చాలని తేల్చారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు కోరుతూ ఈఎన్సీ కార్యాలయానికి సీఈ కార్యాలయం లేఖ రాసింది.
  • ప్రాజెక్టు ఆధునికీకరణకు భారీగా నిధులు కావాలంటూ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలపై 2022లో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • 2023 ఆగస్టు 14న 2022-23 ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌) ప్రకారం రూ.38.54 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నాటి ఈఎన్సీ కార్యాలయం ప్రతిపాదనలు పంపించింది. ఆ దస్త్రం ఆర్థికశాఖ వద్ద పరిశీలనలో ఉండగా.. శాసనసభ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది.  
  • ‌ఈ ఏడాది మార్చి 6న ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.110 కోట్లు మంజూరు చేయాలంటూ నీటిపారుదల శాఖకు సీఈ కార్యాలయం ప్రతిపాదన పంపింది.
  • మార్చి 15న ప్రాజెక్టు పనులకు 2023-24 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం రూ.64.20 కోట్లకు పరిపాలన అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ఈఎన్సీ కార్యాలయం దస్త్రం పంపించింది. ఆ ఫైల్‌ ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఏటా ఇదే తంతు..

కోటిపల్లి వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు సంబంధించి ఇష్టారీతిన స్ట్రక్చర్లను ప్రతిపాదిస్తుండటం, క్షేత్రస్థాయి ఇంజినీర్లు పంపుతున్న అంచనాలకు రాష్ట్రస్థాయి అధికారులు ఆమోదిస్తున్న మొత్తానికి పొంతన లేకపోవడం చర్చగా మారింది. రూ.వంద కోట్లకు పైగా అంచనాలు పంపితే ఒకసారి రూ.34 కోట్లకు.. మరోసారి రూ.64 కోట్లకే తుది దస్త్రాలు సిద్ధం కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిస్తున్న అంచనా నిధుల్లో పెద్దఎత్తున వ్యత్యాసం ఉంటుండటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఏటా అంచనాలు రూపొందించడంతోనే సరిపోతోందని, కనీసం ఈ వర్షాకాలంలోనైనా పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని