భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన ప్రారంభం

గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్‌ సోమవారం ప్రారంభించారు.

Updated : 16 Apr 2024 08:43 IST

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్‌ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్‌ గుమ్మడికాయ కొట్టగా, రామాలయ ఉప ప్రధానార్చకులు ఎ.మురళీకృష్ణమాచార్యులు కలెక్టర్‌తో పూజలు జరిపించారు. అనంతరం ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహనదారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు. 2015 ఏప్రిల్‌ 1న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.

అనంతరం వివిధ కారణాలతో నిర్మాణం జాప్యమైంది. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవచూపి శ్రీరామనవమికల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని సూచించి పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులు, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రతీక్‌ జైన్‌, ఆర్డీవో దామోదర్‌రావు, జాతీయ రహదారుల విభాగం ఈఈ యుగంధర్‌, డీఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని