తెలంగాణ వైపు ఏనుగుల మంద!

మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 17 Apr 2024 07:56 IST

మహారాష్ట్ర నుంచి వస్తాయని అటవీశాఖ అంచనా
నియంత్రణపై దృష్టి.. థర్మల్‌ డ్రోన్‌ కెమెరాల కొనుగోలు
22న అటవీ అకాడమీలో వర్క్‌షాప్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలోకి వస్తే ఏనుగుల మంద కలిగించే నష్టం తీవ్రంగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో.. వాటిని నియంత్రించడం ఎలాగన్న అంశంపై దృష్టి సారించారు. అరణ్యభవన్‌లో కొద్దిరోజుల క్రితం ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించారు. ఏనుగులను నియంత్రించాలంటే.. వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం అత్యంత కీలకం. అవి ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రిపూటా పనిచేసే థర్మల్‌ కెమెరా డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్లు అటవీశాఖలో కీలక అధికారి తెలిపారు.

ఏనుగులకు అనువైన పరిస్థితులు

మహారాష్ట్రలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఏప్రిల్‌ తొలి వారంలో తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టింది. రాష్ట్రంలో ఏనుగు సంచరించడం ఇదే తొలిసారి. చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మండలాల్లో భయాందోళనలు సృష్టించిన ఆ మగ ఏనుగు.. 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల్ని బలిగొంది. ఆ తర్వాత మహారాష్ట్రకు తిరిగివెళ్లిపోయింది. రాష్ట్రంలో అది సంచరించిన ప్రాంతంలో పచ్చని పంటపొలాలు, సమృద్ధిగా నీరుంది. ఏనుగులు స్థిరపడేందుకు అనువైన పరిస్థితులున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60-70 ఏనుగులు సంచరిస్తున్నాయి. ‘‘మహారాష్ట్రలో సంచరిస్తున్న ప్రాంతంతో పోలిస్తే ఆసిఫాబాద్‌ జిల్లాలో మగ ఏనుగు తిరిగిన ప్రాంతం వాటికి ఎంతో అనువైంది. ఈ కారణం దృష్ట్యా తన గుంపును ఆ మగ ఏనుగు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు 100 శాతం ఉన్నాయని భావిస్తున్నాం’’ అని అటవీశాఖలో ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఏనుగుల గుంపు వస్తే కలిగే నష్టంపై ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై ఈ నెల 22న దూలపల్లిలోని అటవీ అకాడమీలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీసీసీఎఫ్‌ (హెచ్‌వోఎఫ్‌ఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎంసీ ఫర్గెయిన్‌తో పాటు అన్ని జిల్లాల అటవీ అధికారులను, అటవీ సంరక్షణకు కృషి చేసే ముఖ్యమైన స్వచ్ఛంద సంస్థల్ని సమావేశానికి అటవీశాఖ ఆహ్వానించింది. 

ఒడిశాలో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల్లో కొన్ని మందలు అక్కడ ఆవాసాలు సరిపోక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నాయి. కొన్ని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లగా.. అక్కడి నుంచి 60-70 ఏనుగులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లాను ఆనుకునే ఉంటుంది. అక్కడి మందలోని ఒక ఏనుగే ఇటీవల తెలంగాణకు వచ్చివెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని