గల్ఫ్‌ కార్మికులకు బోర్డు

గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 17 Apr 2024 07:57 IST

ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ
ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు
కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల బీమా
సెప్టెంబరు 17లోగా సమస్యలన్నింటికీ పరిష్కారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

ఈనాడు, హైదరాబాద్‌: గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే కార్మికుల హక్కులు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీని కోసం జ్యోతిరావ్‌ఫులే ప్రజా భవన్‌లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ పాస్‌పోర్ట్‌ కౌంటరును, కార్మికుల తరఫున ఏ దేశంతోనైనా సంప్రదించే పకడ్బందీ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో గల్ఫ్‌ కార్మిక సంఘాల నేతలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మికులకు పలు హామీలిచ్చారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని, త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి సలహాలతో తుదిరూపు ఇస్తామని పేర్కొన్నారు. ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు తీసుకుంటామని, వారికి చట్టబద్ధత ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. గల్ఫ్‌ కార్మికులకు బీమాను కూడా అమలు చేస్తామని, కార్మికుడు మరణించిన సందర్భంలో.. అతడి కుటుంబానికి రూ.5 లక్షల బీమాను అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 17లోగా గల్ఫ్‌ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కేంద్రంతో మాట్లాడేవాళ్లు ఉండాలి. పార్లమెంటులో మీ గొంతు వినిపించేందుకు నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ను, జీవన్‌రెడ్డి అన్నను గెలిపించండి. చెప్పిన అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కేరళ, ఫిలిప్పీన్స్‌ విధానాల అధ్యయనం

‘ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్‌లో అత్యధికంగా ఉన్నారు. వీరి లావాదేవీలు నిర్వహించడానికి కొన్ని బ్యాంకులే ప్రత్యేకంగా ఏర్పడ్డాయంటే పరిస్థితి అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి గల్ఫ్‌ కార్మికుల సమస్యల గురించి వింటున్నాం. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయపార్టీలు స్పందిస్తాయనే అపోహ మీకుంది. కొన్నిసార్లు అది వాస్తవం కూడా. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికుల విషయంలో కేరళ రాష్ట్రం, ఫిలిప్పీన్స్‌ దేశం అమలు చేస్తున్న విధానాలనూ అధ్యయనం చేశాం. కార్మికుల హక్కులు కాపాడేందుకు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వమే ఇతర దేశాల వ్యవస్థలను సంప్రదిస్తుంది. ఉద్యోగం ఇచ్చిన సంస్థతో చర్చలు జరుపుతుంది. దీనివల్ల కార్మికుల మనోస్థైర్యం పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తాం. గల్ఫ్‌ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేలా చర్యలు చేపడతాం. వారు వెళ్తున్న దేశాలు, అక్కడి యాజమాన్యం, పరిస్థితులపై అవగాహన కల్పిస్తాం. ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలను వివరిస్తాం. విదేశాలకు వెళ్లిన వారు తమ స్వస్థలంలో కొనుక్కున్న ఆస్తులకు రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. వారి తల్లిదండ్రులకు వైద్యం, ఇతరత్రా సాయం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. చనిపోయిన కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. అండగా ఉంటుంది. మీ సమస్యలను వినడానికి కూడా ఓపిక లేకపోతే.. మీ ఓట్లు అడగడానికి అర్హత లేదనేది నా అభిప్రాయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పార్లమెంటులో ప్రస్తావించే అవకాశమివ్వండి: జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘స్థానికంగా ఉపాధి పొందలేని వారు గల్ఫ్‌లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. భార్యాపిల్లలను, తల్లిదండ్రులను వదిలేసి దేశం కాని దేశానికి వెళ్తుండడం బాధాకరం. గత పదేళ్లలో గల్ఫ్‌ కార్మికులు చెమటోడ్చి స్వదేశానికి రూ.2 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చారు. కానీ గత భారాస ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మీ సమస్యలను పార్లమెంటులోనూ ప్రస్తావించేలా నాకు అవకాశం కల్పించండి’ అని కోరారు.


సమస్యలు విన్నవించిన కార్మికులు

ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు పలు సమస్యలను ప్రస్తావించారు. ‘గల్ఫ్‌లోని జైళ్లలో మగ్గుతున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం న్యాయవాదులను ఏర్పాటు చేసి విడిపించేందుకు కృషిచేయాలి. ఏజెంట్ల మోసాలను అరికట్టాలి. మన కార్మికులపై గల్ఫ్‌లో వివక్ష చూపుతున్నారు. అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించాలి. సౌదీ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. అవి రాకుండానే కొందరు చనిపోయారు కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో విన్నవించాం. కానీ ఫలితం రాలేదు. ఆ బకాయిలు ఇప్పించాలి. మహిళా కార్మికులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దీనిపై దృష్టిపెట్టాలి’ అని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌, టీపీసీసీ విదేశీ వ్యవహారాల అధ్యక్షుడు వినోద్‌, టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఇంటర్నేషనల్‌ కన్వీనర్‌ మంద భీమ్‌రెడ్డి, గల్ఫ్‌ కార్మిక సంఘాల నాయకులు నరేశ్‌రెడ్డి, రవి గౌడ్‌, సీహెచ్‌ ప్రవీణ్‌, నరసింహ, మీర్‌ అయూబ్‌ అలీఖాన్‌, రాజు తదితరులు పాల్గొన్నారు. రూ.5 లక్షల బీమా ప్రకటించినందుకు ధన్యవాదాలు చెబుతూ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంను సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని