వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం

సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది.

Published : 17 Apr 2024 07:56 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. రాత్రి 7 గంటల నుంచి జరిగిన ఎదుర్కోలు ఉత్సవంలో స్వామివారి మూర్తులను ఊరేగింపుగా ఆలయం నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. సీతారాముల గుణశీలాలను వివరిస్తూ వైదిక పెద్దలు చేసిన సంవాదం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. గరుడ సేవను తిలకించిన భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఈఓ రమాదేవి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేడు భద్రాద్రిలో జగత్కల్యాణం..: బుధవారం శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సుప్రభాత సేవ, అనంతరం తిరువారాధన నిర్వహించాక ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం చేస్తారు. ఉదయం 8 నుంచి 9 వరకు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాణమూర్తులకు అలంకారం చేసి ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కల్యాణోత్సవ కార్యక్రమాన్ని  నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని