చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది.

Published : 17 Apr 2024 07:55 IST

ఆయా సంస్థలపై ఈఎస్‌ఐసీ కఠిన చర్యలు
తెలుగు రాష్ట్రాల్లో 85,582 యాజమాన్యాల గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. పాక్షికంగా చెల్లించే యాజమాన్యాలను గుర్తించడంతో పాటు మూసివేసిన సంస్థల వివరాలను పరిశీలించి ఎలాంటి బకాయిలు లేకుంటే వాటిని డేటాబేస్‌ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు నెలల్లో చర్యలు తీసుకోవాలని, కార్యాచరణపై ప్రతి 15 రోజులకోసారి ప్రగతి నివేదికలను అందించాలని ప్రాంతీయ కార్యాలయాల డైరెక్టర్లను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో 85,582 సంస్థలు ఈ కేటగిరీలో ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే కార్మికులు, వారి కుటుంబాల ఆధార్‌ సీడింగ్‌ నూరు శాతం పూర్తిచేయాలని సూచించింది.

కార్మికులకు బీమా వైద్యసేవలు అందించాలంటే వారి పేరిట ప్రతినెలా చందా కట్టాలి. ఉద్యోగి వేతనం నుంచి 0.75%, యజమాని తన వాటా కింద 3.25% చొప్పున ప్రతినెలా చెల్లించాలి. కొన్ని యాజమాన్యాలు ఉద్యోగి వేతనం నుంచి మినహాయించిన మొత్తాన్ని, తన వంతు వాటా కింద చెల్లించాల్సిన నగదును చెల్లించడం లేదు. మరికొన్ని సంస్థలు బీమా చందా చెల్లింపులో క్రమం తప్పడంతో అత్యవసర సమయాల్లో కార్మికులకు సేవలు లభించడం లేదు. ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం కార్మికుడికి సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలంటే, ఆ సమయానికి 156 రోజుల (6 నెలల) చందా తప్పనిసరిగా చెల్లించి ఉండాలి. కొన్ని యాజమాన్యాలు సకాలంలో చెల్లించకపోవడంతో అత్యవసర సమయాల్లో వాటి పరిధిలోని ఉద్యోగులు వైద్యసేవలు పొందలేకపోతున్నారు. ఇటీవల ఈఎస్‌ఐసీ స్టాండింగ్‌ కమిటీ.. చందా చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 23,76,903 సంస్థలు ఉంటే.. వీటిలో దాదాపు పది లక్షల సంస్థలు చందా చెల్లించకపోవడం, చెల్లించినా క్రమం పాటించకపోవడం చేస్తున్నాయి. ఇన్ని సంస్థలు ఇలా చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే అర్హులైన కార్మికుల (ప్రతినెలా చందా చెల్లించేవారు) సంఖ్య ఆధారంగా ఈఎస్‌ఐసీ వైద్యానికి నిధులు మంజూరు చేస్తోంది. ఒక్కో కార్మికుడి వైద్యం కోసం రూ.3 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సొమ్ముతో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రులను నిర్వహిస్తూ కార్మికులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 33,483 సంస్థల పరిధిలో 15.45 లక్షల మంది కార్మికులకు మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి. తెలంగాణలో ఐదేళ్లకుపైగా కార్మికుల పేరిట చందా చెల్లించని సంస్థలు 25,118 ఉన్నాయి. వీటితోపాటు సక్రమంగా చెల్లించని సంస్థలు 23,766తో కలిపి మొత్తం 48,884 ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి ఉప కార్యాలయాలు, ఏపీ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఇలాంటివి 36,698 సంస్థలు ఉన్నట్లు ఈఎస్‌ఐసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని