కేసుల వివరాలు అందించిన పోలీసులు

భాజపా తరఫున పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు.

Updated : 17 Apr 2024 06:21 IST

భాజపా పిటిషన్‌పై విచారణను మూసివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా తరఫున పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది. తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను అందజేయాలని డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా స్పందించకపోవడంతో భాజపా ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డీజీపీకి మార్చి 7న, 14న వినతిపత్రాలు ఇచ్చినా వివరాలు అందజేయలేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇది సమంజసమైన అభ్యర్థనేనని, దీనిపై వివరణ తెలుసుకుని చెప్పాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీచేశారు. పోలీసులు వివరాలు అందజేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది భోజన విరామం తరువాత చెప్పడంతో విచారణను మూసివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని