చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!

కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్‌ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 19 Apr 2024 04:04 IST

ప్రభుత్వ శాఖలకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్‌ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 21న ‘నాలాల్లో నిర్మాణాలు.. చెరువుల్లో విల్లాలు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ హైకోర్టుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కబ్జాలతో చెరువులు కుంచించుకు పోతున్నాయని, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, ఇది భవిష్యత్తుకు ప్రమాదకరమని.. ప్రస్తుత ఆర్థికాభివృద్ధి, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. చెరువుల్లో, నాలాల్లో, వ్యవసాయ పొలాల్లో నిర్మాణాల వల్ల సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా నీటి వనరుల్లో సాగుతున్న ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి లేఖతోపాటు ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని జత చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి; పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీయే లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. చెరువుల రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని