శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం

శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు.

Updated : 19 Apr 2024 06:27 IST

ఈటీవీ, ఖమ్మం- భద్రాచలం, న్యూస్‌టుడే: శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. రామాలయ స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, ఉపప్రధానార్చకులు శ్రీమన్నారాయణాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు, రామస్వరూప్‌ పర్యవేక్షణలో సాగిన విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం భక్తిభావాలను పంచింది. భక్తరామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ ఒక్కొక్కటి భక్తులకు చూపించారు. అంతకు ముందు స్వామివారికి ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రధానాలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుడు, లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయాలను గవర్నర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో శాంతిస్థాపన వెల్లివిరిసేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి, కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని