‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు

‘నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ-జనరల్‌) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్‌ సర్కిల్‌ ఇంజినీర్లు తీసుకొచ్చారు.

Published : 20 Apr 2024 06:14 IST

పనులను పదేపదే చూపడంతోపాటు పరిశీలన లోపాలు
హైదరాబాద్‌ సర్కిల్‌ సీఈకి మెమో ఇచ్చిన నీటిపారుదలశాఖ
 ‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ‘నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ-జనరల్‌) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్‌ సర్కిల్‌ ఇంజినీర్లు తీసుకొచ్చారు. కోటిపల్లి వాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి నీటిపారుదల శాఖ నిబంధనలకు అతీతంగా.. అసాధారణ రీతిలో హైదరాబాద్‌ సర్కిల్‌ సీఈ అంచనాలను సమర్పించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’ అని నీటిపారుదల శాఖ పేర్కొంది. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు కోటిపల్లి వాగు ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించిన అంచనాల ప్రతిపాదనలు పొంతన లేకుండా ఉండటంపై తాజాగా హైదరాబాద్‌ సీఈ ధర్మాకు మెమో జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘కొలిక్కిరాని కోటిపల్లి వాగు ‘కోట్లా’ట!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎన్సీని ఆదేశించినట్టు సమాచారం. స్పందించిన ఈఎన్సీ అనిల్‌కుమార్‌ సీఈకి మెమో జారీ చేసినట్లు తెలిసింది.

భిన్న అంచనాలతో చర్చనీయాంశం

కోటిపల్లివాగు వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల అంచనాల రూపకల్పన ప్రక్రియ 2022 నుంచి కొనసాగుతోంది. పలుమార్లు వివిధ మొత్తాలతో అంచనాలు రూపొందడం వివాదాస్పదమైంది. చివరిగా రూ.38.54 కోట్లలో పూర్తిచేసేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాసన సభాపతి ప్రసాద్‌కుమార్‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం రెండు టీఎంసీలకు పెంచి, ఇతర మరమ్మతులతో కలిపి రూ.110 కోట్లను మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చీఫ్‌ ఇంజినీరు(సీఈ) అంతే మొత్తానికి ప్రతిపాదనలు రూపొందించి అంచనాలను ఈఎన్సీకి సమర్పించారు. అనంతరం పరిశీలన చేపట్టిన ఈఎన్సీ కార్యాలయం రూ.64.20 కోట్లకు అంచనాలను కుదించి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తగిన సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు లేకుండానే రూ.110 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించారంటూ ఈఎన్సీ కార్యాలయం సీఈ, క్షేత్రస్థాయి ఇంజినీర్లను తప్పుపడుతూ తాజాగా మెమో జారీ చేసింది.

మెమోలో ముఖ్యాంశాలిలా..

  •  సీఈ సమర్పించిన అంచనా వ్యయం నీటిపారుదల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
  •  ప్రతిపాదనల్లో పేర్కొన్న పనుల్లో కొన్నింటిని పలుమార్లు (డూప్లికేట్‌) చేర్చారు.
  •  నీటి మట్టం స్థాయులపై సర్వే సహా ఎలాంటి సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకోకుండానే జలాశయంలో పూడిక తీతకు సంబంధించిన అంశాలు జోడించారు.
  • హెడ్‌వర్క్స్‌, ఆప్రాన్‌ తదితర మరమ్మతులకు సంబంధించి డిజైన్స్‌ విభాగం ఆమోదంతో పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ సలహాదారు సూచనలు చేయగా, అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు.
  •  కాలువ పొడవునా కిలోమీటరుకు 350 పాట్‌ హోల్స్‌కు ప్రతిపాదనలు పంపారు. సరైన ప్రాతిపదిక లేకుండానే ఈ అంశాన్ని పొందుపరిచారు.
  •  శాఖ నిబంధనలు అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధమైన అంచనాలను మాత్రమే పంపాలని ఈఎన్సీ కార్యాలయం గతంలో పలుమార్లు ఆదేశించింది. ఆ ఆదేశాలను సీఈ పరిగణనలోకి తీసుకోలేదు.
  •  క్షేత్రస్థాయితోపాటు కార్యాలయంలోని ఇంజినీర్లు విచక్షణ లేకుండా వ్యవహరించడం ఇబ్బందులు సృష్టించింది. బాధ్యులైన ఇంజినీర్లందరూ వివరణ సమర్పించేలా చర్యలు తీసుకుని మరోసారి ప్రతిపాదనలు సమర్పించాలి’’ అని మెమోలో పేర్కొన్నట్టు సమాచారం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని