గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం

రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.

Published : 20 Apr 2024 06:14 IST

చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద తీవ్ర రద్దీ
తొక్కిసలాట... ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం

ఈనాడు, హైదరాబాద్‌, మొయినాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. ప్రసాద వితరణ ప్రదేశం వద్ద తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 50 మందికిపైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు వారిని అతికష్టమ్మీద బయటకు తెచ్చి అంతే కష్టంగా అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు. సంతానప్రాప్తి లేని మహిళలకు గరుడప్రసాద వితరణ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో ఉదయం ఆరుగంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు సొంత వాహనాలతో తరలిరావడం... నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టింది. ఆలయానికి ఐదు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ఎండలోనే భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.  ప్రసాద పంపిణీ పూర్తి కావొస్తుండడంతో తమకు దొరుకుతుందో లేదో అని వందల మంది ఒక్కసారిగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది. ప్రసాదం కేవలం 10 వేలమందికి సరిపోయేంత మాత్రమే ఉండగా ఉదయం 10 గంటలకే 70వేల మందికిపైగా భక్తులు లైన్లలో నిల్చున్నారు. దీంతో మళ్లీ చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 35వేల మందికి వితరణ చేశారు. ప్రసాదం అయిపోయిందని పోలీసులు, ఆలయ పూజారులు మైకుల్లో చెప్పినా భక్తుల రాకమాత్రం ఆగలేదు. మొత్తం 1.50లక్షల మందికిపైగా భక్తులు వచ్చారని పోలీసుల అంచనా. అనుకున్న దానికంటే బాగా ఎక్కువగా రావడంతో అసౌకర్యం కలిగిందని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌ తెలిపారు. గరుడ ప్రసాద వితరణ శుక్రవారంతో పూర్తయిందని, వచ్చే ఏడాది నుంచి నాలుగురోజుల పాటు ఇవ్వనున్నామని ఆయన వీడియో సందేశం ద్వారా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని