మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు.

Published : 20 Apr 2024 06:15 IST

పొరపాటుగా భావించాలని ఇంజినీర్లు కోరారు
నీటిపారుదల శాఖకు నివేదించిన ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు. పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు వివరణ ఇచ్చారని సీఈ రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, బ్యారేజీల ప్రారంభం జరిగిన కొద్ది కాలానికే సీపేజీ సమస్య వచ్చినా చర్యకు ఉపక్రమించని నీటిపారుదల శాఖ.. విజిలెన్స్‌ నివేదికతో స్పందించింది. ‘మేడగడ్డ బ్యారేజీపై ఫిబ్రవరి 13న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఎం సమక్షంలో ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌తో సహా పలు వైఫల్యాలను సీఎం ఎత్తి చూపారు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోయాయి. 2019 నవంబరులోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు తలెత్తాయి. గుత్తేదారుకు ఒకవైపు గడువు పొడిగిస్తూ.. ఇంకోవైపు ఆ గడువులోగానే నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెల్లడైంది. ఇంజినీర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరండి. సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి’ అని నీటిపారుదల శాఖ  ఈఎన్సీ (జనరల్‌).. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం)కు లేఖ రాశారు. గత నెలలో రాసిన ఈ లేఖకు రెండు రోజుల క్రితం సీఈ.. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీకి లేఖ రాశారు. ‘ఒప్పందం ప్రకారం పని పూర్తి కాలేదు. ఇంకా చేయాల్సి ఉంది. అనుభవ సర్టిఫికెట్‌ బదులు పూర్తయినట్లు పొరపాటున ధ్రువీకరణ పత్రం ఇచ్చామని సంబంధిత ఇంజినీర్లు తెలియజేశారు’’ అని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. సర్టిఫికెట్‌ను ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఇవ్వగా, ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేశారు. సీఈ లేఖపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని