రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

Published : 20 Apr 2024 04:53 IST

ఏఐపీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్‌

నల్లకుంట, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మే 15 నుంచి.. మూడు వారాలపాటు జిల్లా, మండల కేంద్రాల్లో వివిధరూపాల్లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌ మార్క్స్‌ భవన్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన అప్పటి భారాస ప్రభుత్వం.. అనంతరం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల హామీ అమలులో జాప్యాన్ని నివారించాలని కోరారు. సేద్యానికి రైతులకిచ్చే రాయితీల కొనసాగింపు, ఫసల్‌ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరికీ వర్తింపజేయడం, మద్దతు ధర చట్టం రూపొందించి పంటలన్నిటికీ అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెచ్చెల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని